బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన వీహెచ్.. కర్ణాటక వ్యవహారంలో బీజేపీ అనుసరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటకలో న్యాయం గెలిచిందని, అవినీతి ఓడిందన్నారు. న్యాయాన్ని కాపాడిన సుప్రీంకోర్టు ధర్మాసనానిని సలాం అని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు చాలా అప్రమత్తతో ఉండాలని, ఆయన పై కక్ష తీర్చుకునే ప్రయత్నంలో, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ వేసారని సంచలన ఆరోపణలు చేసారు.. సౌత్ ఇండియాలో చంద్రబాబు బలమైన నేత కాబట్టి, ఆయన్ను బలహీన పరుస్తారాని వీహెచ్ అన్నారు.
ఇది ఇలా ఉండగా, బీజేపీ చేస్తున్న పనుల పై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నారని, కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడినా బీజేపీ వెంటాడుతుందని చెప్పారు. యశ్వంత్ సిన్హా లాంటి సీనియర్ నాయకుడే... మోదీతో దేశానికి ప్రమాదం అంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. మోదీని తెర వెనుక నుంచి ప్రేమించే జగన్‌లాంటి వారికి ఇది షాక్ అని వ్యాఖ్యానించారు.
కర్ణాటక పరిణామాల పై చంద్రబాబు కామెంట్... కర్ణాటకలో రాజకీయ పరిస్థితి దారుణంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. అప్రజాస్వామిక విధానాలను కర్ణాటకలో అవలంబిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపా కుయుక్తులు పన్నుతోందని ఆరోపించారు. కర్ణాటకలో సంప్రదాయానికి విరుద్ధంగా పనులు జరుగుతున్నాయన్నారు. కర్ణాటకను భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. గాలి జనార్దన్ రెడ్డి ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించటం ఏమిటని అన్నారు. ప్రతిపక్ష నేత కర్ణాటకలో జరుగుతోన్న దారుణాలను ప్రశ్నిచలేరా అని వ్యాఖ్యానించారు. తమిళనాడు, కర్ణాటక, ఏపీలు వృద్ధి చెందుతోన్న రాష్ట్రాలని, వీటిని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.