దేశ వ్యాప్తంగా సంచలనం సష్టించిన తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో దళితుల శిరోముండనం కేసులో బాధితులకు ఇంకా న్యాయం జరగకముందే, జిల్లాలో మరో దళిత యువకునికి తీవ్ర అవమానం జరిగింది. సీతానగరం పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దళితులపై వివక్ష ఇంకా కొనసాగుతుందనడానికి ఇటువంటి ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బాధితులకు సత్వర న్యాయం జరగకపోవడం, రాజకీయ నాయకుల జోక్యం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వంటి కారణాలతో దళితులపై దాడులు, దారుణాలు పునరావతమవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1997లో రామచంద్రాపురంలో పెత్తందార్ల ఆధ్వర్యాన ముగ్గురు దళిత యువకులకు శిరోముండనం జరిగింది. దాదాపు 23 సంవత్సరాలు గడుస్తున్నా ఈ కేసు నేటికీ కొలిక్కి రాలేదు. ఈ కేసులోప్రస్తుత అధికార పార్టీ నేత తోట త్రిమూర్తులు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. బాధితులైన కోటి చినరాజు, మరో ఇద్దరికి నేటికీ న్యాయం జరగలేదు. దోషులకు శిక్ష పడకపోవడంతో సీతానగరం లాంటి సంఘటన పునరావత మైందని దళిత సంఘాలు ఆక్షేపిస్తున్నాయి.
సీతానగరం మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడు, ఇసుక వ్యాపారి కె.కష్టమూర్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి దళిత యువకుడు ఇండగమిల్లి వరప్రసాదు చావబాది, పోలీస్ స్టేషన్లో సోమవారం శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. పోలీసులతో పాటు ఇసుక మాఫియాపైనా ఆట్రాసిటీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలని, ఘటనపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల వైఖరి వల్లే తాజాగా మరో బాధితుడు శిరోముండనానికి గురయ్యాడు. ఈ ఘటనను నిరసిస్తూ కెవిపిఎస్, దళిత సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో, ఘర్షణ వీడియో బయటపడింది. సీతానగరంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి బయటపడ్డ వీడియోలో, ఇసుక లారీ వద్ద మాజీ సర్పంచ్, బాధితుడు గొడవపడినట్టు కనిపించింది. అయితే ఇదే సందర్భంలో, తప్పు తమదేనని, మాజీ సర్పంచ్ ఒప్పుకుంటున్నట్టు కూడా కనిపించింది. అయితే తరువాత ఏమైందో ఏమో కాని, పోలీసుల చేత శిరోముండనం చేపించారు. వీడియో ఇక్కడ చూడవచ్చు., https://youtu.be/au10_ub2Kck