విజయవాడ వెస్ట్ అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించారంటూ, స్వయానా అక్కడ సిట్టింగ్ ఎమ్మల్యేగా ఉన్న జలీల్ ఖాన్ చెప్పారు. ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, తన కుమార్తె షబానా ఖాతూర్ టీడీపీలో చేరారు. మంగళవారం తండ్రి జలీల్‌ఖాన్‌తో పాటు షబానా టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా జలీల్‌ఖాన్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంల టీడీపీ అభ్యర్థిగా తన కుమార్తె పేరును చంద్రబాబు ఖారారు చేసినట్లు తెలిపారు. పశ్చిమ స్థానాన్ని చంద్రబాబుకు కానుకగా ఇస్తామని జలీల్‌ఖాన్ అన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ కాలేదని, తన సేవలను పార్టీకి వినియోగించుకుంటామని సీఎం చెప్పారన్నారు. అవసరమైతే గుంటూరు జిల్లాలో కన్నా పై పోటీ చేస్తానని తెలిపారు.
జలీల్‌ఖాన్ కుమార్తె షబానా మాట్లాడుతూ, మొదటి నుంచి తాను సీఎం అభిమానినని, అమెరికాలోని వర్జీనియాలో టీడీపీ కోఆర్డినేటర్‌గా ఉన్నానని తెలిపారు. అమెరికా నుంచి తమ కుటుంబం ఏపీకి వచ్చేసిందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు. త్వరలో విజయవాడ పశ్చిమలో ప్రచారం ప్రారంభిస్తానని షబానా ఖాతూర్ చెప్పారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లడడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ... జగన్, కేసీఆర్ తో కలిసి , అధికారం కోసం ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలులో సామాన్యుడు విభజన హామీలు అమలు చేయాలని అడిగితే బీజేపీ నేతలు దాడి చేశారని ఆరోపించిన జలీల్ ఖాన్... పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే కన్నాపై తాను... పోటీ చేస్తానని ప్రకటించారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. ఇక్కడ ఎప్పటి నుంచో రాజకీయాలు చేస్తున్నారు జనాబ్ జలీల్ ఖాన్. ఇక్కడ ఆయనకు మంచి అండ కూడా ఉంది. గతంలో 1999 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఆయన కాంగ్రెస్ జెండాపై విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో విభేదించి చానాళ్లు దూరంగా ఉన్నారు. ఇక, వైసీపీలో చేరి 2014లో ఆ జెండా టికెట్‌పై పోటీ చేసి గెలుపొందారు. వాస్తవానికి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గెలుపొందాయి. ఇక్కడ టీడీపీ మాత్రం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. 1983 ఎన్నికల్లో జయరాజు ఇక్కడ నుంచి టీడీపీ గుర్తుపై పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసలో ఐదు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయం సాధించగా.. ఆరు సార్లు కాంగ్రెస్ ఇక్కడ జయకేతనం ఎగురవేసింది. ఇక, చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ కూడా ఇక్కడ గెలుపొందడం రికార్డు సృష్టించింది. ఆ పార్టీ తరఫున 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ విజయం సాధించారు.