ఇటీవల వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, నాలో-నాతో వైఎస్ఆర్ అంటూ, వైఎస్ విజయమ్మ ఒక పుస్తకం రాసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో, జ్ఞాపకాలు అన్నీ పొందుపరిచారు. వైఎస్ కుటుంబానికి సంబంధించి బయటకు తెలియని విషయాలు అందులో ప్రస్తావించారు. అయితే ఇలా ఉండగా, ఈ పుస్తకంలోని 237వ పేజీలో, విజయమ్మ చెప్పిన ఓ విషయం చర్చనీయంసంగా మారింది. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చూపించేందుకు, ఒక పేపర్ ఉండాలని, నాడు సాక్షి పేపర్ పుట్టుకొచ్చిందని, ఆ సందర్భంలో, వైఎస్ఆర్ కి, జగన్ కి జరిగిన సంభాషణ పంచుకున్నారు. సాక్షి పెట్టిన కొత్తలో, వైఎస్ఆర్ తో జగన్ మాట్లాడుతూ, నాన్నా ప్రభుత్వం చేస్తున్న తప్పులు, సిస్టం ఫెయిల్యూర్ మన సాక్షిలో రాయవచ్చా అని జగన్ అడిగారు అంట. దీనికి సమాధానం ఇస్తూ, సాక్షిని ప్రజల మనస్సాక్షిగా తీర్చి దిద్దు అన్నారు అంట, వైఎస్ఆర్. ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపిస్తేనే కదా, ప్రభుత్వం వాటిని గుర్తించి సరి చేసుకుంటుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అని అన్నారు అంట.
నాడు రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలని, జగన్ ఇప్పటికీ నమ్ముతారని, పాత్రికేయ విలువలు, నిజాన్ని నిర్భయంగా రాస్తూ, నేటికీ జగన్ అలాగే ఉన్నారని విజయమ్మ రాసారు. ఇదంతా బాగానే ఉంది కాని, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జగన్ చేస్తున్న దానికి, విజయమ్మ పుస్తకంలో రాసిన దానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తుంది. సిస్టం ఫెయిల్యూర్ గురించి రాయొచ్చా అని నాడు తన తండ్రిని అడిగిన జగన్, ఇప్పుడు తానూ అధికారంలోకి రాగానే, జీవో 2430 తీసుకొచ్చి, మీడియాను ఎలా కట్టడి చేస్తున్నారో చూస్తున్నాం. ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపే మీడియా పై ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు. ఒక కధనం ప్రసారం చేసిన జర్నలిస్ట్ మూర్తి పై సిఐడి కేసు ఎందుకు పెట్టారు ? ప్రభుత్వం చేసే తప్పులు చెప్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు నోటీసులు ఎందుకు ఇచ్చారు ? సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేపిస్తున్నారు, లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. నాడు రాజశేఖర్ రెడ్డి చెప్పిన మాటలు, జగన్ మర్చిపోయారా ? చూద్దాం, ఇప్పటికైనా విమర్శని తట్టుకునే ఓర్పు వస్తుందేమో..