ఎమ్మెల్యేగా ఓడిపోయాడు.. అయినా ఆయన మంత్రి అయ్యాడు. అందుకు కారణం మరెవరో కాదు.. సాక్షాత్తూ తన తల్లి చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో జగన్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. తమతోపాటు ఆయన కూడా ఎన్నో కష్టాలు అనుభవించారని, అందుకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని తల్లి చెప్పడంతో జగన్ చలించిపోయి.. ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అలా మంత్రి అయిన వ్యక్తి మరెవరో కాదు, ఆయనే మాజీ మంత్రి, దివంగత వైయస్ ప్రియ శిశ్యుడు మోపిదేవి వెంకటరమణ. జగన్ కేబినెట్లో అందరూ ఎన్నికల్లో గెలిచి వచ్చిన వారే. మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్యేగా గెలవకపోయినా మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసి మోపిదేవి ఓడిపోయారు.
ఇక్కడ తెదేపా అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ వరుసగా రెండోసారి విజయం సాధించారు. అయితే.. మోపిదేవి వెంకటరమణపై వైఎస్ కుటుంబానికి ఎనలేని అభిమానం. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరెడ్డి క్యాబినెట్లో కూడా ఈయన మంత్రిగా పదువులు అనుభవించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రోశయ్య, కిరణ్కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఈయన మంత్రిగా ఉన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయనతోపాటు మోపిదేవి కూడా జైలుకు వెళ్లారు. దాదాపు రెండేళ్లపాటు జగన్ కంటే ఎక్కువ రోజులపాటు జైల్లో ఉన్నారు. దీంతో ఆ సమయంలో తనతోపాటు ఎన్నో కష్టాలు అనుభవించిన మోపిదేవికి మంచి చేయాలని జగన్ భావించారు. ఇదే సమయంలో జగన్ తల్లి విజయమ్మ కూడా ఓ సలహా ఇచ్చారట.
మోపిదేవి వెంకటరమణ ఒక్కడే జగన్తోపాటుఅప్పట్లో జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తించి.. ఆయన తాజాగా ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిగా అవకాశం ఇవ్వాలని సూచించారట. తల్లి సూచన.. జగన్కు ఉన్న అభిమానం దృష్ట్యా మోపిదేవికి మంత్రిగా అవకాశం దక్కింది. త్వరలో మోపిదేవిని ఎమ్మెల్సీ చేసి మంత్రిగా కొనసాగించేందుకు జగన్ భావిస్తున్నారు. అలా జగన్ తల్లి విజయమ్మ సూచనతో మోపిదేవికి ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిగా అవకాశం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం వెలగపూడిలోని సచివాలయం వేదికగా ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 25 మందితో గవర్నర్ నరసింహన్ శనివారం ప్రమాణస్వీకారం చేయించారు. ఘనంగా జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్, నూతనంగా ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ధర్మాన కృష్ణ ప్రసాద్, బొత్స సత్యనారాయణ, పాముల పుష్పవాణి, అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ), పినిపే విశ్వరూప్, ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, తానేటి వనిత, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేశ్, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కలత్తూరు నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, అంజాద్ బాషా, మాలగుండ్ల శంకర్ నారాయణ ఉన్నారు.