శుక్రవారం అమరావతిలో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి అశోక్‌గజపతిరాజుతో పాటు విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాల అభ్యర్థులు అతిది గజపతి, పతివాడ నారాయణస్వామినాయుడు, డాక్టర్ కేఏ నాయుడు, కిమిడి నాగార్జున, కోండ్రు మురళీమోహన్, కిమిడి కళా వెంకటరావు హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో గెలుపొందుతామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. బూత్‌ల వారీగా మెజార్టీ, గెలుపునకు ఉన్న అవకాశాలు, వైసీపీ మైండ్‌గేమ్‌ను అభ్యర్థులు ప్రస్తావించారు. ఐదు వేల పైబడి మెజార్టీతో విజయం సాధిస్తామని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలు ధీమా వ్యక్తం చేశారు.
నియోజకవర్గాల వారీగా మూడు దశల్లో సమీక్షలు నిర్వహించారు. తొలుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆధ్వర్యంలో నేతలతో సమీక్షించారు. తరువాత దశలో మహిళా నేత పంచుమర్తి అనురాధ అభ్యర్థులు, నేతలతో మాట్లాడి వివరాలు సేకరించారు. చివరిగా ముఖ్యమంత్రి నియోజకవర్గాల వారీగా సమీక్ష చేపట్టారు. దాదాపు ఇలా సమీక్షలన్నీ అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. పార్టీ అభ్యర్థుల గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది ఎవరు? పార్టీలోనే ఉంటూ దొంగదెబ్బ తీసింది ఎవరు? అన్నదానిపై చంద్రబాబు ఆరాతీశారు. దీనిపై సమగ్రంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఈవీఎంల మొరాయింపుతో ఎదురైన ఇబ్బందులను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి కిమిడి నాగార్జున మాట్లాడుతూ తాను గెలుపొందుతానని సీఎం చంద్రబాబుతో చెప్పారు. తన వద్ద ఉన్న సర్వేలో కూడా నాగార్జున గెలుపొందుతారని తేలిందని చంద్రబాబు బదులిచ్చినట్టు సమాచారం.
గజపతినగరం నియోజకవర్గంలో ఏరియా కో ఆర్డినేటర్లు ఇచ్చిన ఓటింగ్ సరళిపై చర్చ సాగింది. 8 వేల ఓట్లు పైబడి మెజార్టీతో గెలుపొందుతానని ఎమ్మెల్యే కేఏ నాయుడు నమ్మకంగా చెప్పారు. దీని పై ముఖ్యమంత్రి స్పందిస్తూ 2014 ఎన్నికల్లో 18,500 ఓట్లు మెజార్టీతో గెలుపొంది... ఇప్పుడు తగ్గడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల దృష్ట్యా పెరగాలి కదా అని వ్యా ఖ్యానించినట్టు తెలుస్తోంది. దీంతో అభ్యర్ధి కంగుతిన్నారు. నెల్లిమర్ల నియోజవర్గంపై సమీక్ష జరుగగా...తప్పకుండా గెలుపొందుతానని ఎమ్మెల్యే పతివాడ నారాయ ణస్వామినాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్య మంత్రి ఈసందర్భంగా వెల్లడించారు. 110 నుంచి 120 సీట్లు మనకు రాబోతున్నాయన్నారు.. బొబ్బిలి నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందుతానని మంత్రి సుజయ్ కృష్ణరంగారావు ధీమా వ్యక్తం చేశారు.