బీజేపీ - వైసీపీ బంధం గురించి, రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఈ రోజు, కేంద్ర మంత్రి, జగన్ ను సియంను చేస్తాం అని కూడా చెప్పారు. అయితే, రెండు రోజుల క్రితం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఆశ్చర్యాన్ని కలిగించింది. జమిలి ఎన్నికలకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీజేపీ విధానానికి అనుకూలంగా వైసీపీ వ్యవహరించింది. అయితే తాము బీజేపీకి సపోర్ట్‌గా జమిలికి మద్దతు తెలియచేయలేదని దేశ ప్రయోజనాల కోసమే మద్తతు తెలిపామని విజయసాయి రెడ్డి చెప్పారు. మరో పక్క, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలో బీజేపీకి కానీ, బీజేపీ మిత్ర పక్షాల అభ్యర్థికి కానీ మద్దతు ఇవ్వబోమని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ పరిణామంతో విలేకరులు ఒకింత ఆశ్చర్య పోయారు. ఇప్పటికే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక పై, అమిత్ షా, కెసిఆర్, జగన్ లతో మాట్లాడి, వారి మద్దతు తీసుకున్నారు.
అయితే విజయసాయి మాత్రం, మేము బీజేపీకి మద్దతు ఇవ్వం అంటూ చెప్పారు. విజయసాయి అంత ధైర్యంగా ఎలా చెప్పారు ? అమిత్ షా ఊరుకుంటారా ? అనే ప్రశ్నలు తలెత్తాయి. అమిత్ షా తలుచుకుంటే, వారం రోజుల్లో, జగన్, విజయసాయి రెడ్డి, ఇద్దరూ జైల్లో ఉంటారు. అందుకే, జగన్, బీజేపీకి లొంగిపోయాడు. విజయసాయి రెడ్డి అయితే, డైలీ ప్రధాని కార్యాలయంలోనే జీవనం. అలాంటి, విజయసాయి రెడ్డి, ఇప్పుడు ఇలా ఎందుకు అంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. తాము బీజేపీకి కానీ, బీజేపీ మిత్రపక్షాల అభ్యర్థికి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మద్దతు ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అది అంతిమంగా ఎన్నికల్లో నష్టాన్ని చేకూరుస్తుందని వైసీపీ భావిస్తోందనే, విజయసాయి రెడ్డి ఇలా చెప్పారని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
ఇలా పైకి ఎదో చెప్పినా, ఆ టైంకు బీజేపీకే మద్దతు ఇస్తామని వైసీపీ సీనియర్లు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పై వ్యతిరేకత ఉండనే విషయం మాకూ తెలుసు, వారితో వెళ్తే మేము మునుగుతాం అని తెలుసు, కాని జగన్ కేసుల విషయంలో వారు చెప్పినట్టు వినక తప్పదు అని ఒక వైసిపీ నేత అన్నారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దాకా, బీజేపీ జోలికి జగన్ వెళ్ళడని, అంతకు ముందు ఎదురు తిరిగితే, జరిగేది ఏంటో జగన్ కు తెలుసని అంటున్నారు. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసి చాలా రోజులైంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఒక్క ఖండన ప్రకటన రాలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చింది. అయితే, బీజేపీతో అంటకాగుతున్నామన్న ముద్రపడిపోయిందని వైసీపీ భయపడుతోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీకి దూరం జరిగామని చెప్పుకోవాలనే వ్యూహం అమలు చేస్తున్నట్లు విజయసాయి రెడ్డి ప్రకటన చూస్తే అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ విషయం అమిత్ షా కు తెలిస్తే మాత్రం, సినిమా వేరలా ఉంటుంది.