నవ్యాంధ్ర రాజధాని కేంద్రంగా మారిన విజయవాడ నగరం బైపాస్ రహదారికి కేంద్రం మోకాలడ్డుతోంది. కేవలం 47 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి కొర్రీల మీద కొర్రీలు వేస్తోంది. గతంలో నిర్మించు, నిర్వహించు, అప్పగించు(బీఓటీ) కింద అప్పగించిన ప్రాజెక్టుకే ఏదోరకంగా వంకలు పెడుతోంది. జాతీయ రహదారి నెం16 విస్తరణ పనుల్లో భాగంగా విజయవాడ బైపాస్ రహదారితో పాటు కృష్ణా నదిపై వంతెన నిర్మాణం పనులను బీఓటీ ప్రాజెక్టు కింద ఎన్‌హెచ్‌ఏఐ మంజూరు చేయగా దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గామన్ ఇండియా దక్కించుకుంది. ఆ ప్రకారం గుంటూరు జిల్లా చినకాకాని నుంచి పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు ఆరు వరసల రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది.
చిన్నఅవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాలి. ఈ క్రమంలో చిన్నఅవుట్పల్లి వద్ద పనులను ప్రారంభించి గామన్ ఇండియా మూడేళ్ల తర్వాత తాము చేయలేమంటూ చేతులెత్తేసింది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ దీన్ని ఈపీసీ కింద చేపట్టాలని నిర్ణయించి నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. బైపాస్ రహదారి, కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం డీపీఆర్ అందించేందుకు ఏడు సంస్థలు గత జులైలోనే ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (బిడ్లు) సమర్పించాయి. కానీ ఈ బిడ్లనే ఖరారు చేయకపోవడం విశేషం. వివరణలు పంపినా మళ్లీ తాజా అంచనాలు అంటూ దస్త్రాలను తిప్పి పంపుతున్నారు. దీనిపై ఎంపీలు పలుసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది.
కొర్రీలు వేయడం వెనుక రాష్ట్రంతో కేంద్రం అనుసరిస్తున్న ఘర్షణ వైఖరే కారణమని అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరానికి రాకుండా ఈ బైపాస్‌లో విశాఖకు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి. అలాగే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అనువుగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్ భారం తగ్గే అవకాశం ఉంది. విజయవాడ బైపాస్ లేకపోవడం వల్ల గన్నవరం, గూడవల్లి, నిడమానూరు, ప్రసాదంపాడు, రామవరప్పాడులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. గత రెండు నెలల్లోనే 10 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క ఏడాదిలో ఈ గ్రామాల్లో జరిగిన ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.