సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను తీసుకొంటుంది. అయితే విజయవాడలో మాత్రం ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి నియమాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా కౌన్సిలింగ్, కేసులు రాయటం లాంటివి చేశారు. ఈ నెల 26 నుంచి, మరింత కఠినంగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.
ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా అమలు చేసే నిమిత్తం విజయవాడ పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు.హెల్మెట్ ధరించిన వారికే బంకుల్లో పెట్రోల్ విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేశారు.
ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గౌతం సవాంగ్. తల్లిదండ్రులు తమ పిల్లలకు అధిక సామర్థ్యం గల ద్విచక్రవాహనాలను ఇవ్వొద్దని, పిల్లలు హెల్మెట్లు ధరించేలా చూసే బాధ్యత వారి తల్లిదండ్రులదేనని ఈ సందర్భంగా గౌతం సవాంగ్ సూచించారు.