రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్‌ను అరికట్టేందుకు పోలీస్ శాఖ తరఫున విజయవాడలో నూతన సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో సైబర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా విజయవాడలో క్రైమ్ రేటును తగ్గించేందుకు ఇంటర్ సెప్టార్స్ వాహనాలను డీజీపీ ఆర్పీ ఠాకూర్ విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు తదితర ఉన్నతాధికారులతో కలిసి మహాత్మాగాంధీ రోడ్డులోని వ్యాస్ కాంప్లెక్స్ ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
నగర పరిధిలో 12 ఇంటర్ సెప్టార్ వాహనాలు 24 గంటలు పాటూ అందుబాటులో ఉంటాయి. ప్రధాన కూడళ్లైన బెంజిసర్కిల్, దుర్గగుడి, గొల్లపూడి వై జంక్షన్ తదితర ప్రాంతాల్లో 12 చోట్ల ఈ వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతీ వాహనంలో నలుగురు పోలీసు సిబ్బంది ఉంటారు. వాహనంలో అన్ని రకాల పరికరాలు ఉంటాయి. జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా నేరం జరిగినప్పడు దగ్గరలో ఉన్న ఇంటర్ సెప్టార్ బృందానికి సమాచారం అందిస్తారు. దీంతో నిందితులను త్వరగా పట్టుకునేందుకు అవకాశముంటుందని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్ సెప్టార్ వాహనాల ఇంచార్జ్‌లకు కిట్లను అందించారు.
అలాగే ప్రజలు తమ సమస్యలను పోలీసులకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు నూతన నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సమస్య ఉంటే 7328909090 నంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపాలని ఈ సందర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, పోలీసు ఉన్నతాధికారులు ఎ.బి.వెంకటేశ్వరరావు, అమిత్‌గార్గ్, విజయవాడ సంయుక్త పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.