ఓ గుడికి యాచకుడు రూ.లక్ష విరాళంగా ఇచ్చిన ఘటన విజయవాడలోని ముత్యాలంపాడులో చోటు చేసుకుంది. 11 ఏళ్ల వయసులో తెలంగాణ నుంచి విజయవాడకు వెళ్లి, అక్కడే స్థిరపడ్డ యడ్ల యాదిరెడ్డి మొదట రిక్షా తొక్కి డబ్బులు సంపాదించేవాడు. వయసు మీదపడడంతో పని చేయలేక, అక్కడి షిర్డీ సాయిబాబా మందిరంలో యాచకుడిగా మారాడు. తనకు 'నా' అనే వారు ఎవరూ లేరని.. తాను భిక్షమెత్తుకున్న సాయిబాబా గుడికి మంచి చేయాలని విరాళమిచ్చానని చెప్పాడు.గతంలోనూ ఆయన పలు ఆలయాలకు భారీగా విరాళాలు అందించాడు. ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో ఈనెల 26న లక్ష నారికేళ జలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికే యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు.
గురు పౌర్ణమి రోజున సాయిబాబాకు లక్ష ఎనిమిది కొబ్బరి కాయలతో జలార్చన చేయాలని దేవాలయ కమిటీ నిర్ణయించింది. చాలా ఖర్చుతో కూడుకున్న ఈ కార్యక్రమానికి తన వంతు సాయం చేయాలని యాదిరెడ్డి నిర్ణయించారు. అప్పటిదాకా తాను దాచుకున్న చిల్లర అంతా తీసి కొబ్బరి కాయకు రూపాయి చొప్పున లక్ష ఎనిమిది రూపాయలను విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు. ఇప్పటివరకు ఆలయాలకు మొత్తం 5,00,000 రూపాయలు ఇచ్చాడు. తన జీవిత చరమాంకం దేవుడి సన్నిధిలోనే గడిపేస్తానని చెప్పాడు. తనకు అన్నం పెట్టిన భక్తులకు కృతజ్ఞతలు చెబుతున్నానని యాదిరెడ్డి చెప్పాడు. దేవుడి వల్లే తాను ఈ వయసులోనూ ఆరోగ్యంగా ఉన్నానని అన్నాడు.
సాయిబాబా ఆలయంలో నిత్యాన్నదానానికి గతంలో యాదిరెడ్డి లక్షా ఎనిమిది రూపాయలను ఇచ్చారు. దత్తాత్రేయ విగ్రహానికి రూ.50 వేలతో వెండి తొడుగులు చేయించారు. ఆ పక్కనే ఉన్న కోదండ రామాలయానికి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. దుర్గాదేవి ఆలయానికి లక్ష నూట పదహారు రూపాయలను ఇచ్చారు. ఇప్పటివరకు వివిధ ఆలయాలకు రూ.5 లక్షల వరకు విరాళాలుగా ఇచ్చారు. యాచక వృత్తితో వచ్చిన డబ్బుతో గొల్లపాడులో స్వయంగా ఓ దేవాలయాన్ని నిర్మించారు. గుళ్లలో భక్తులు పెట్టే ప్రసాదాలు తిని కడుపు నింపుకుంటున్న యాదిరెడ్డి దేవాలయ ప్రాంగణాల్లోనే నిద్రపోతుంటారు. ప్రయాణ ఖర్చులు మినహా మిగతాదంతా పొదుపు చేస్తున్నారు. తనకు ఏమీ అవసరం లేదని యాచక వృత్తి ద్వారా వచ్చినదంతా దేవాలయాలకు ఇస్తూ జీవిత చరమాంకాన్ని గడిపేస్తానని చెబుతున్నారు ఈ యాచక ‘శ్రీమంతుడు’యాది రెడ్డి.