వైసిపీ పార్టీలో నెంబర్ టు అయిన విజయసాయి రెడ్డి కృషి అంతా ఇంతా కాదు. ఢిల్లీ లెవెల్ లో జగన్ కు సంబంధించిన విషయాలు అన్నీ చక్కబెట్టటంలో ఆరితేరిపోయారు విజయసాయి రెడ్డి. అందుకే ఆయానకు ఎన్ని విమర్శలు వచ్చినా, రాజ్యసభ సీటు కట్టబెట్టారు జగన్. అంతటితో ఆగలేదు, అధికారం రాగానే, నిబంధనలు సడలించి మరీ, ఆయనకు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యెక ప్రతినిధిగా నియమించారు. ఇంత ప్రాధాన్యత జగన్ ఇస్తున్నారు అంటే, విజయసాయి రెడ్డి చేస్తున్న సేవలు అంత ముఖ్యవైనవి. తక్కువ కాలంలోనే, ప్రధాని మోడీ చేత, విజయ్ గారు అని పిలిపించుకున్నారు అంటే, విజయసాయి రెడ్డికి ఢిల్లీలో ఉన్న పలుకుబడి ఏంటో ఇట్టే అర్ధమై పోతుంది. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఎవరినీ నమ్మకపోయినా, విజయసాయి రెడ్డిని మాత్రం అందలం ఎక్కించారు.
ఇంతకీ విజయసాయి రెడ్డి సక్సెస్ ఫార్ములా ఏంటో ఆలోచిస్తే మనకు ఇట్టే అర్ధమై పోతుంది. అయిన సక్సెస్ ఫార్ములా, ఒక బోకే, ఒక శాలువా, ఒక వెంకటేశ్వర స్వామీ విగ్రహం. వీటితోనే ముందు ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకుని, వారికి దగ్గర అయిపోతున్నారు. మొన్నా మధ్య రాష్ట్రపతి ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డి తీరు చూసి అందరూ ఆశ్చర్య పోయారు. రాష్ట్రపతి అభ్యర్ధి ఎవరో బీజేపీ పెద్దలు చెప్పకుండానే, ఎవరి పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయో, వారిని ముందే కలిసి వారికి బోకే ఇచ్చి, ఫోటో దిగేవారు. అప్పట్లో ఆయన తీరుతో అందరూ అవాక్కయ్యారు కూడా. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో, ఢిల్లీ లీడర్స్ కు అర్ధం కాలేదు. ఆయన ఇబ్బందులు ఆయనకు ఉంటాయి అనుకోండి. రాష్ట్రపతిగా రాంనాద్ కోవిండ్ డిసైడ్ అవ్వగానే, ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం కూడా తీసుకున్న సీన్లు మనం చూసాం.
అయితే ఇప్పుడు కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారు విజయసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఒరిస్సాకు చెందిన, బిశ్వభూషన్ హరిచందన్‌ను రాష్ట్రపతి నియమించిన సంగతి తెలిసిందే. ఆయన 23 తారీఖున విజయవాడ వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, అంత కంటే ముందే, ఈ రోజు, బిశ్వభూషన్ హరిచందన్‌ను భువనేశ్వర్ లో కలిసారు విజయసాయి రెడ్డి. ఆయనకు బోకే, శాలువా, వెంకటేశ్వర స్వామి ఫోటో బహుకరించి, మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. అయితే, విజయసాయి రెడ్డి ఇంత హడావిడిగా, ఆయన విజయవాడ రాక ముందే, ఎందుకు వెళ్లి కలిసారో అని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గవర్నర్ ను మచ్చిక చేసుకునే విషయంలో, ముందుగానే అక్కడి దాకా వెళ్ళారని, గవర్నర్ తో మంచి సంబంధాలకు ఇది దోహద పడుతుంది, వైసిపీ నేతలు అంటున్నారు.