ఈ రోజు రాజ్యసభలో, కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన, దేశాన్ని ఒక ఊపు ఊపింది. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాశ్మీరీ ప్రజల అభిప్రాయం మాత్రం, తెలియటం లేదు. అయితే ఈ నిర్ణయాన్ని సమర్ధించే వారు, వ్యతిరేకించే వారు. ఈ విషయం పై రాజ్యసభలో చర్చ జరుగుతుంది. వివిధ పార్టీలకు చెందిన వారు, వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు. ఇదే విషయం పై మన రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ 370 అధికరణను రద్దు చేస్తూ, మోడీ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన నిర్ణయం తీసుకుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ విషయంలో మా అధినేత జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ మీకు ఉంటుందని తెలియచెస్తున్నాం అని విజయసాయి రెడ్డి అన్నారు.
ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న, మోడీ, అమిత్ షా లకు హాట్స్ ఆఫ్ చెప్పారు విజయసాయి రెడ్డి. అంతే కాదు పనిలో పనిగా నెహ్రుని కూడా తిట్టారు. సహజంగా బీజేపీ పార్టీ రాజకీయంగా నెహ్రుని, కాంగ్రెస్ ని తిడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వెరైటీగా విజయసాయి రెడ్డి నెహ్రుని తిట్టారు. ఇంతటితో అయిపోలేదు. అసలు విషయం ఇక్కడే ఉంది. అమిత్ షాని అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఆకాశానికి ఎత్తేసారు. బీజేపీ నేతలు కూడా ఈ రేంజ్ లో భజన చెయ్యలేదు కాని, విజయసాయి రెడ్డి మాత్రం, కొత్త పేరు పెట్టి మరీ, అమిత్ షా భజన చేసారు. నిజంగా ఈ సమస్య పై విజయసాయి రెడ్డి ఇంతగా కనెక్ట్ అయ్యి, అమిత్ షా ని ఈ రేంజ్ లో ఎత్తారా లేక రాజకేయంగా ఈ ప్రకటన చేసారో కాని, మరోసారి విజయసాయి రెడ్డి తమ స్వామి భక్తిని చాటుకున్నారు.
ఇక మరో పక్క ఆర్టికల్ 370 రద్దు అంశం పై, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అయిన టిడిపి, వైసీపీ, టీఆర్‌ఎస్ తమ మద్దతు ప్రకటించాయి. ఇక జాతీయ పార్టీల్లో బీఎస్పీ, ఏఐఏడీఎంకే, బిజు జనతా దళ్,ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్, పీడీపీ, డీఎంకే, ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మద్దతు తెలిపిన పార్టీలు మాత్రం, ఇంతటితో కాశ్మీర్ లో శాంతి వచ్చేయదని, నోట్ల రద్దులా కాకుండా, దీన్ని సంపూర్ణంగా పూర్తీ చెయ్యాలని, కాశ్మీర్ లో ఇప్పుడు హింస చెలరేగకుండా చూడాలని వివధ పార్టీలు కోరుతున్నాయి. ఇప్పటికే జమ్ము కాశ్మీర్ రాష్ట్రం మొత్తం, భద్రతా బలగాల పహారాలో ఉంది. రాష్ట్రం అంతటా 144 సెక్షన్, కొన్ని చోట్ల కర్ఫ్యూ కూడా ఉంది. అలాగే చాలా మంది హౌస్ అరెస్ట్ లో ఉన్నారు, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం బంద్ అయ్యింది. ఈ పరిస్థితిలో అక్కడ పరిస్థితి ఎలా ఉందొ, తెలియని పరిస్థితి. ఏది ఏమైనా, అంతా మంచి జరగాలని కోరుకుందాం.