రౌడీ పార్టీ, మరోసారి రెచ్చిపోయింది. ఐఏఎస్ , ఐపిఎస్ లకు వార్నింగ్‌లు చూసాం, సియం అయిన గంటలో చంపేస్తా అని చెప్పింది చూసాం, ఇప్పుడు ఏకంగా మీడియా దగ్గర కెమెరాలు లాక్కుని, చిత్రీకరించిన ఫూటేజ్ ధ్వంసం చేసారు. జగన్ పర్యటన ఏర్పాట్లపై చర్చించేందుకు ఏర్పాటుచేసిన పాయకరావుపేట నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. సాక్షాత్తూ వైసీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో జరిగిన ఈ గొడవను చిత్రీకరించిన విలేకరుల వద్ద కెమెరాలు లాక్కుని, ఆయన మనుషులు బలవంతంగా లాక్కొని ఫొటోలను డిలీట్ చేశారు.
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఈనెల 20వ తేదీన కోటవురట్ల జంక్షన్లో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి బహిరంగ సభ జరగనున్నది. ఈ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని కోటవురట్ల మండలం తంగేడులో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు ఇంట్లో విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి పాయకరావుపేట నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధ్యక్షత వహించారు. ఆ సమయంలో, పార్టీలో సీనియారిటీపై తంగేడు రాజులకు, మండల పార్టీ అధ్యక్షుడికి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ రగడ అంతా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలోనే జరిగింది. అయితే సభలో జరిగిన గొడవను విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయగా...విజయసాయిరెడ్డి వెనుక ఉన్న కొంతమంది సభ్యులు సెల్‌ను లాక్కొని ఫొటోలను దౌర్జన్యంగా తొలగించారు. దీని పై విలేకరులు భగ్గు మంటున్నారు. విజయసాయిరెడ్డి ఉండగానే, ఇంత జరిగినా, ఆయన ఏమాత్రం వాళ్ళని ఆపలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సమక్షంలో , మీడియా పై దాడి చేసి, ఫూటేజ్ ధ్వంసం చేస్తే, కనీసం విజయసాయి వాళ్ళని ఆపలేదని విలేకరులు బాధపడుతున్నారు. దీని పై చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు.