రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఫెడరల్ ఫ్రంట్ విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతిస్తున్నట్టు చెబుతున్నారని, కానీ, ఆయన ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని కోరారు. 'వైసీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించాడంటూ రెండేళ్ల పాటు ఏపీ అసెంబ్లీని బహిష్కరించారు. మరి, తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు జగన్ మద్దతు ప్రకటించడం ఏమైనా న్యాయమా? ఏపీలో తప్పయిన ఫిరాయింపులు తెలంగాణలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలి.
కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేయడంపై జగన్ అభిప్రాయం ఏంటో వివరించాలి' అంటూ విజయశాంతి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. అయితే, దీనిపై ఇటు వైసీపీ నేతలు కానీ, అటు టీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు. రాములమ్మ ఫేస్‌బుక్ పోస్ట్ యథావిథిగా... " కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తామని వైసీపీ అధినేత జగన్ గారు చెబుతున్నారు. ఈ సందర్భంగా నేను జగన్ గారిని అడిగేది ఒకటే... వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేరేందుకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించారనే కారణంతో గత రెండేళ్ల పాటూ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలంతా బహిష్కరించారు. ఏపీలో పార్టీల ఫిరాయింపుపై తిరుగుబాటు చేస్తూ,"
"తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేందుకు ప్రలోభాలు పెడుతున్న కేసీఆర్ గారితో కలిసి, జాతీయ స్ధాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని జగన్ గారు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం. ఏపీలో తప్పైతే తెలంగాణలో ఎలా ఒప్పవుతుందో జగన్ గారు వివరణనివ్వాలి. కేసీఆర్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం జగన్ గారి దృష్టిలో తప్పా, ఒప్పా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది" అని విజయశాంతి చెప్పుకొచ్చారు. అయితే రాములక్క వ్యాఖ్యలపై టీఆర్ఎస్, వైసీపీ నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే మరి.