విరాట్ కోహ్లి, మన ఇండియా క్రికెట్ టీంలో సచిన్ తరువాత అంత పేరు తెచ్చుకున్న క్రికెటర్. విరాట్ కోహ్లి అంటే, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే సుపరిచితుడు. విరాట్ కోహ్లి అంటే ఒక క్రేజ్. విరాట్ కోహ్లి నుంచి కంప్లిమేంట్ వచ్చింది అంటే అదో కిక్కు. అలాంటి విరాట్ కోహ్లి మన విశాఖపట్నం పై ప్రశంసలు కురిపిస్తూ, ట్వీట్ చేసారు. విరాట్ కోహ్లి తాజాగా వెస్టిండీస్ రెండో వన్డే కోసం, విశాఖపట్నం వచ్చాడు. వైజాగ్ చూసి ఫిదా అయిపోయాడు. "What a stunning place.Love coming to Vizag. " అంటూ ట్వీట్ చేసాడు కోహ్లి. హోటల్ రూమ్ నుంచి, బీచ్ రోడ్ కనిపించేలా ఫోటో తీసి, ట్వీట్ చేసాడు. ఇంతకు ముందు కూడా అనేక మంది, వైజాగ్ పరిశుభ్రత చూసి, ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
ఎక్కడో ఇండోర్‌లో జరగాల్సిన భారత్-వెస్టిండీస్ రెండో వన్డే.. అనుకోని విధంగా విశాఖపట్నానికి తరలి వచ్చింది. ఇక్కడీ వీసీఏ-వీడీసీఏ స్టేడియం బుధవారం వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. దేశంలో భారత క్రికెట్ జట్టుకు బాగా కలిసొచ్చిన మైదానాల్లో ఇది ఒకటి. టీమ్‌ఇండియా ఆటగాళ్లందరూ విశాఖ నగరాన్ని, ఇక్కడి మైదానాన్ని చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లాంటి స్టార్లకు ఈ మైదానంలో మధురానుభూతులున్నాయి. ధోని ఏంటో ప్రపంచానికి తెలిసింది 2005లో ఇక్కడ పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తోనే. ఆ మ్యాచ్‌లో 148 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ధోని పేరు మార్మోగిపోయింది.
అప్పటి నుంచి ధోనికి విశాఖతో బంధం ఏర్పడింది. ఎప్పుడు ఇక్కడ మ్యాచ్ ఆడేందుకు వచ్చినా.. ఈ నగరం గురించి, ఇక్కడి మైదానం గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు మహి. ఇక ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి విశాఖలో బరిలోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే. 65, 99, 118, 117.. ఇవీ ఇక్కడ కోహ్లి స్కోర్లు. రెండుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులందుకున్నాడు. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక మ్యాచ్‌లో 70 పరుగులు చేస్తే.. ఇంకోసారి 90 పరుగులతో అజేయంగా నిలిచాడు. గత ఏడాది చివరగా ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు అతడి నాయకత్వంలోనే బరిలోకి దిగి శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ధావన్ సైతం ఇక్కడ సెంచరీ కొట్టాడు.