ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. సహజంగానే ఓ వైపు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీకి విశాఖ సిట్టింగ్ సీటు అందుకే సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉంది. గుంటూరులో లాగా బీజేపీ సభకు వైసీపీ సహకారం అందిస్తోందని... ఇతర పార్టీలు అనుమానిస్తున్నాయి. బీజేపీతోపాటు విడిగా అయినా వైసీపీ కూడా రైల్వే జోన్ సంబరాలు చేసుకోవడమే ఇందుకు కారణం. కానీ జోన్ ప్రకటనతో ప్లస్ కన్నా మైనస్సే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఏర్పుడతోంది. మోదీ రెండు నెలల కింద దేశీయ పర్యటనలు ప్రారంభించారు. ఎన్నికల ప్రకటన వచ్చేలోపు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర పరిధిని బట్టి రెండు నుంచి 6 సభల్లో పాల్గొనాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అన్ని ప్రభుత్వ ఖర్చుతో జరిగే సభలే.
అయితే ఇప్పుడు మోదీ బహిరంగ సభ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. సభకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. జోన్ పై బీజేపీ చేసిన డ్రామాలే దీనికి కారణం. మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా పలాసలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బహిరంగ సభ ‘ఫ్లాప్’ అయ్యింది. బీజేపీ నేతలు మూడువేల కుర్చీలు వేశారుకానీ, మూడొందల మందిని కూడా సమీకరించలేకపోయారు. దీంతో అమిత్ షా సభా వేదిక కూడా ఎక్కకుండా... బస్సుపై నుంచే ప్రసంగించి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో... మోదీ సభకు జన సమీకరణ చేయడంపై బీజేపీ నేతలు తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాన్ని సమీకరించటం అంత సులువు కాదనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది.
‘ఏది ఏమైనా, ఎలాగైనా’ మైదానం నిండాలని... దీనికోసం టీడీపీ వ్యతిరేక పక్షమైన వైసీపీ సహాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వైసీపీ కీలక నేతలకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బీజేపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఒకవేళ ప్రధాని సభకు ప్రజాదరణ కరువైతే... చంద్రబాబు వాదనకు బలం చేకూరినట్లవుతుందని, దీనికోసమైనా బీజేపీ సభకు సహకరించాలని వైసీపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. గుంటూరులో కూడా జగన్ ఆటోల్లో ఎలా తరలించారో, వీడియోలతో సహా చుసిన సంగతి తెలిసిందే.