విశాఖ ఉక్కును ప్రయివేటీకరిస్తూ కేంద్రప్ర భుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు పేరిట ఎన్నో త్యాగాలు చేసి, ఏకంగా 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్న తరువాత సాధించిన ఉక్కు పరిశ్రమను ఇప్పుడు నష్టాల పేరిట కేంద్రం ప్రయివేటీకరించడం సరికాదని పలువురు మేధావులు, రాజకీయ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యం లోనే కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడుతు న్నారు. గత 41 రోజులుగా కార్మిక వర్గాలు రిలేనిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాయి. అయితే ఉద్యమం తీవ్రతరం చేసినప్పటికి ఉత్పత్తికి మాత్రం ఎటువంటి లోటు లేకుండా కార్మిక వర్గాలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నాయి. ఇప్పుడు 40 ఏళ్లు తరువాత అరుదైన రికార్డును స్టీల్ ప్లాంట్ వర్గాలు సాధించాయి. 2019 మార్చి 30న నమోదైన 20,018 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తిని ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున బ్రేక్ చేస్తూ అదే రోజు 20,150 టన్నుల ఉత్పత్తితో బ్లాస్ట్ ఫర్నేష్ కార్మికులు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఇక మార్చి 6న రికార్డు స్థాయిలో 20,350 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించిన కార్మికులు ఈ నెల 23న ఏకంగా 20,400 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి దిశగా పురోగతి సాధించారు. ఈ తరహా ఉత్పత్తిని కొనసాగించినట్లు అయితే ఈ ఏడాది చివరి నాటికి విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.300 కోట్లు లాభాలు ఆర్జించే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇక మార్చిలో బ్లాస్ట్ ఫర్నేస్లో 1, 2, 3 లలో 20.400 టన్నుల రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించారు. సొంత గనులు లేకపోయినా లాబాల బాట పడుతున్న ఉక్కును నష్టాల నుంచి అధిగమించే విధంగా చేయడం పెద్ద కష్టం కాదని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ప్రధానంగా నష్టాల బాటపట్టేందుకు మూలధనం అప్పులపై 14 శాతం వడ్డీ చెల్లింపు, ఆపై ఏ రోజూ సొంత గనులు కేటాయించకపోవడం వల్ల అధిక రేటుకు ముడిసరుకు కొనుగోలు చేయాల్సి రావడం కారణాలుగా చెబుతున్నారు. కేంద్రం సహకరిస్తే త్వరలోనే విశాఖ ఉక్కు నష్టాల నుంచి లాభాల బాట పడుతుందని కార్మికవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు ప్రజల సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఈ పరిశ్రమను పోస్కోకు విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రులంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహోన్నతమైన ఉద్యమం దశలోనూ ఉక్కు గత రికార్డులను బద్దలకొడుతూ ఉత్పత్తి దిశగా దూసుకుపోతుండడం విశేషం. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం మవుతుంది.