వైసీపీలో వర్గపోరు పతాకస్థాయికి చేరుకుంది. వైసీపీ అధినేత జగన్ గృహ ప్రవేశానికి ఆయన చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి గైర్హాజరు కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్‌పై బాబాయ్ అలకే దీనికి కారణమని పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్నందునే వైవీ రాలేదనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు లోక్‌సభ స్ధానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. జగన్ మాత్రం టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పేశారనే ప్రచారం జరుగుతోంది. సుబ్బారెడ్డి సేవలను పార్టీ ఉపయోగించుకోవాలని జగన్ నిర్ణయించారు. ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా వైసీపీలో చెరోదారిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, బాలినేని వర్గాలను పక్కనపెట్టి ఇతర నాయకులను ఆకర్షించేందుకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు.
ఇందులోభాగంగా దగ్గబాటి హితేష్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేర్చారు. అంతేకాదు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. మాగుంటను చేర్చుకోవడాన్ని వైవీ వ్యతిరేకించారు. ఓడిపోయిన వ్యక్తి తమకు అక్కరలేదంటూ పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత ఎన్నికల్లో కూడా తానే బరిలో దిగుతానంటూ ప్రకటించుకున్నారు. వైవీ వ్యాఖ్యలపై జగన్‌కు పార్టీ నేతలు ఉప్పందించారు. అయినప్పటికీ వైవీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంపీగా పోటీకి సిద్ధమని సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. టికెట్‌పై ఒత్తిడి పెంచేందుకు వైవీ కుటుంబంతో సహా జగన్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో టికెట్ లేదని కరాఖండిగా చెప్పేశారని ప్రచారం జరుగుతోంది.
జగన్ తీరుతో సుబ్బారెడ్డి కుటుంబసభ్యులంతా మనస్తాపానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఒంగోలుకు వెళ్లిపోయారు. తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి కూడా హాజరుకాలేదు. సహజంగా కుటుంబ వ్యవహారాలను సుబ్బారెడ్డే చూసుకుంటారు. ఈ సారి మాత్రం వారి కుటుంబసభ్యులు ఎవ్వరూ కనిపించలేదు. సుబ్బారెడ్డి భార్య వైఎస్ విజయమ్మ సోదరి. సహజంగానే కుటుంబ కార్యక్రమాల్లో ఇద్దరు కలిసి కనిపిస్తుంటారు. గృహప్రవేశంలో మాత్రం సుబ్బారెడ్డి భార్య కనిపించలేదు. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు వైవీ కుటుంబం హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి అని కూడా చెబుతున్నారు. భవిష్యత్తులో సుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. అంతేకాదు ఈ కుటుంబ కలహాలు వైసీపీలో ఎలాంటి పరిణామాలు దారి తీస్తాయోనని వైసీపీ వర్గాలకు గుబులు పట్టుకుంది.