ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికారులపై వేటు అంతా పథకం ప్రకారమే జరిగిందా? సోమవారం ఫిర్యాదు చేస్తే.. మంగళవారం చర్యలుంటాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డికి శుక్రవారమే ఎలా చెప్పారు? ఏపీలోని కీలక పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ మంగళవారం చర్యలు తీసుకుంటుందని వైసీపీకి ముందే తెలుసా..? అంటే.. వీటన్నింటికీ విజయసాయిరెడ్డి గత శుక్రవారం మీడియాతో మాట్లాడిన వీడియో బలం చేకూరుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం వైసీపీ ఏది చెబితే దాన్ని నమ్మి చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. ఈ నెల 22న (శుక్రవారం) వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలుసుకున్నారు.
డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో సహా కొంతమంది అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. తాము సోమవారం మళ్లీ పూర్తిస్థాయి కమిషన్‌ను కలుసుకుంటామని, మంగళవారం కమిషన్ సభ్యులు సమావేశమై తాము కోరిన విధంగా చర్యలు తీసుకుంటారని విజయ్‌సాయిరెడ్డి శుక్రవారమే అశోకారోడ్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ముందు మాట్లాడుతూ చెప్పారు. ఆయన ముందుగా ప్రకటించినట్లుగానే మంగళవారం ఏపీ అధికారులపై వేటు వేశారు. శుక్రవారం విజయసాయి రెడ్డి ఢిల్లీలో మీడియా ముందు ఏం మాట్లాడారంటే... ‘మేం పలు అంశాలను ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకొచ్చాం. వాటన్నింటిపైనా చీఫ్ ఎన్నికల కమిషనర్ మాత్రమే కాకుండా పూర్తిస్థాయి కమిషన్‌కు నివేదించాలని వారు చెప్పారు."
"పూర్తి కమిషన్‌ను మేము అపాయింట్మెంట్ అడిగాం. సోమవారం నాలుగున్నర గంటలకు మా వైసీపీ ప్రతినిధులు పూర్తిస్థాయి కమిషన్ ముందు వినతిపత్రం సమర్పిస్తారు. ఏదైతే మేం నివేదించామో, వాటిపై కమిషన్ మాకు తప్పకుండా న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకుంది. ఆ తర్వాత మంగళవారం లేదా.. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తుంది’ అని చెప్పారు. విజయసాయిరెడ్డి చెప్పినట్లే ఈసీ చర్యలు.. సోమవారం వైసీపీ ప్రతినిధులను కలిసిన ఈసీ మంగళవారం ముగ్గురు అధికారులపై వేటు వేసింది. నిజానికి నెలరోజుల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి కూడా ఫిబ్రవరి 4న ప్రధాన ఎన్నికల కమిషనర్ అరోరాను కలుసుకుని కొంతమంది అధికారులను తప్పించాలని కోరారు. ఒకే అంశంపై ఒక పార్టీకి చెందిన ప్రతినిధులను పలు సార్లు కలుసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ వారి కోరికలకు అనుగుణంగానే చర్యలు తీసుకోవడం న్యాయనిపుణులను ఆశ్చపర్యపరుస్తున్నది.