ప్రజలను, బీజేపీ నాయకులు ఎలా మభ్యపెడుతున్నారు అనేదానికి, ఇదే ఒక ఉదాహరణ. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ రాజ్యసభలో సానుకూల ప్రకటన చేశారని.. అందుకు కృతజ్ఞత తెలిపేందుకు, రాష్ట్ర బీజేపీ నేతలు, బీజేఎల్పీ నేత, విశాఖ ఉత్తర స్థానం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు సారథ్యంలోని తొమ్మిదిమంది సభ్యుల బృందం, ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లారు. విశాఖకు జోన్ ఇచ్చేసారు, ఈ ప్రకటన చేసిన రాజ్‌నాథ్‌సింగ్ కు కృతజ్ఞత చెప్తున్నాం అంటూ, పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకుని, వెళ్లారు. దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్న రైల్వేజోన్ ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ రాజ్‌నాథ్ రాజ్యసభలో ప్రకటన చేయడం ఎంతో ఆనందానికి గురి చేస్తుంది అని చెప్తున్నారు.. ఇది ఒక వైపు... మరి రెండో వైపు ఏంటో తెలుసా ?
కేంద్ర హోంశాఖ సుప్రీం కోర్ట్ కి ఇచ్చిన అఫిడవిట్ లో, రైల్వే జోన్ సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఓ పక్క రైల్వే జోన్ హామీ నెరవేరుస్తామని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మొన్నటికిమొన్న పార్లమెంటు ఉభయసభల్లో ప్రకటించగా.. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఆయన శాఖే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది. ఈ ఏడాది మార్చి 12న జరిగిన సమావేశంలో రైల్వే జోన్‌పై రైల్వే శాఖ ప్రతినిధి తమ వైఖరిని స్పష్టం చేశారని అందులో తెలిపింది. ‘ఈ అంశంపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు సీనియర్ రైల్వే అధికారులతో కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ పార్లమెంటు సభ్యులు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలు తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటాం. కాగా దేశంలో ఇప్పటికే 16 రైల్వే జోన్లు ఉన్నాయి. మరో జోన్ ఏర్పాటుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సమర్థ నిర్వహణ (ఆపరేషనల్లీ ఎఫిషియంట్) సాధ్యం కాకపోవడమే దీనికి కారణమని రైల్వే ప్రతినిధి చెప్పారు’ అని పేర్కొంది.
ఏపీ విభజన చట్టంపై నాలుగు రోజుల క్రితం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చకు కేంద్ర హోం మంత్రి సమానమిస్తూ రైల్వే జోన్ ఇస్తామని చెప్పడం, ఇక్కడ బీజేపీ నేతలు ట్రైన్ వేసుకుని బయలుదేరటం, ఇవన్నీ రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్లని చెయ్యటానికే. వీళ్ళు ఇలా ట్రైన్ ఎక్కారో లేదో, ఈ వార్తా బయటకు వచ్చింది. ఇది చూస్తుంటే, ఢిల్లీ నేతలు, పాపం రాష్ట్ర బీజేపీ నేతలను కూడా పిచ్చోళ్లని చేసి, ప్రజల్లో ఫూల్స్ ని చేస్తున్నారేమో అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇలా రకరకాల మాటలతో ప్రజలను మభ్య పెడుతున్న బీజేపీ నాయకులకు, ప్రజలే సరైన బుద్ధి చెప్తారు.