లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. మోదీ మరోసారి ప్రధాని అవుతారా? లేదంటే యూపీఏ గెలుస్తుందా? అనేది మరో మూడు రోజుల్లో తేలనుంది. ఐతే కౌంటింగ్‌కు ముందు జాతీయ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో వరుస భేటీలు జరుపుతూ హాట్‌టాపిక్‌గా మారారు. ఈ క్రమంలో బీజేపీ నేత విష్ణకుమార్ రాజు ఢిల్లీలోని ఏపీభవన్‌లో చంద్రబాబును కలిశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని..మర్యాాదపూర్వకంగానే సీఎంను కలిసేందుకు వచ్చానని ఆయన చెప్పారు.
అసలే బీజేపీ, టీడీపీ ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఇరు పార్టీల మధ్య నిత్యం మాటల యుద్దం జరుగుతుంది. దీనికి తోడు బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు విపక్ష నేతలతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబును విష్షు కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. తమతో కలవాల్సిందిగా విష్ణుకుమార్‌తో బీజేపీ పెద్దలు రాయబారం పంపారా? లేదంటే విష్ణుకుమార్ రాజే టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారా? అని ఏపీలో జోరుగా జరుగుతున్నాయి.
మరోవైపు ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ నేత శరద్ పవార్, లోక్‌తంత్రిక్ జనతాదళ్ నేత శరద్ యాదవ్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యారు. ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపారు. ఎన్డీయే కూటమి మ్యాజిక్ మార్క్ చేరకుంటే ప్రభుత్వ ఏర్పాటులో తటస్థ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలన్నింటికీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.