బీజేపీ శాసనసభాపక్ష నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు గత కొన్నాళ్లుగా అటా?, ఇటా? అన్నట్టు తర్జనభర్జన పడుతున్నారు. ఒకానొక దశలో తెలుగుదేశం పార్టీలో చేరి, మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావించారు. అయితే ప్రధాని విశాఖ పర్యటన తరువాత తాను ఒక నిర్ణయానికి వస్తానని ఆయన చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి కొత్త రైల్వేజోన్ ప్రకటిస్తే, బీజేపీకి మైలేజీ వస్తుందని, అప్పుడు పార్టీ అభ్యర్థిగా మళ్లీ విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తన మనసులో మాట చెప్పారు. ఒకవేళ రైల్వేజోన్ ప్రకటించకపోతే ఏమిటనేది ఆలోచిస్తానని వివరించారు. ఆయన ఆశించినట్టుగానే ప్రధాని విశాఖ పర్యటనకు ముందే కేంద్రం విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ప్రకటించింది.
అందులో వాల్తేరు డివిజన్ లేకపోయినప్పటికీ ‘జోన్ తెస్తామని మాట ఇచ్చాము...తెచ్చాము. హామీ నిలుపుకొన్నాము’ అంటూ సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారబోరని మరోసారి విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే విష్ణుకుమార్‌రాజు మాత్రం ఇంకా ఎటూ తేల్చులేకపోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు ప్రకటించిన జోన్ బీజేపీకి మైలేజీ తేక పోగా, అది ఎక్కువ డ్యామేజ్ చేసిందని, అయినా ఈ జోన్ విషయం స్థానికంగా గెలుపునకు దోహదపడుతుందా? లేదా? అనే మీమాంసలో వున్నట్టు తెలుస్తోంది. జోన్ విషయం ప్రకటించిన తరువాత, బీజేపీ పై ఆగ్రహావేశాలు వచ్చాయి. ప్రజలు పనికిరాని జోన్ ఇచ్చారనే ఉద్దేశంలో ఉన్నారు.
దీంతో విష్ణుకుమార్‌రాజు మళ్ళీ పార్టీ మార్పు పై ఆలోచనలో పడ్డారు. బీజేపీలో ఉంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం ఉన్న పరిస్థుతుల్లో, ఒక వైపు బీజేపీ తరఫున పోటీకి సిద్ధపడుతూనే...మరో వైపు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒకసారి కలిసి తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆయన యోచిస్తున్నట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో చంద్రబాబును కలవడానికి విష్ణుకుమార్‌రాజు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ తరువాతే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టమవుతుంది. ఒకవేళ విశాఖ ఉత్తరం నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీ చేయకపోతే పార్టీ నగర అధ్యక్షుడు ఎం.నాగేంద్ర అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.