తాను రాజకీయాల్లోకి రాను అని ముందే స్పష్టం చేశానని అదే మాటకు కట్టుబడి ఉన్నానని బీవీ రాజు గ్రూపు కంపెనీల చైర్మన్ కేవీ విష్ణురాజు స్పష్టం చేశారు. తాను జనసేన పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలు సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ని మార్యద పూర్వకంగా కలిసానని, ఆయన సూచన మేరకు అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకు అంగీకరించానని చెప్పుకొచ్చారు. విద్యా, ఉపాధి రంగాల్లో సలహాలు ఇచ్చేందుకు, సహకరించేందుబాధ్యతలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసినట్లు తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు ఇదే అంశంపై చర్చించినట్లు తెలిపారు. ఇకపోతే బీవీ రాజు గ్రూపు కంపెనీల ఛైర్మన్ గా కె.వి.విష్ణురాజు పనిచేస్తున్నారు. పద్మభూషణ్ బీ.వీ.రాజు మనవుడుగా విష్ణురాజు అందరికీ సుపరిచితులు.
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా విష్ణురాజును జనసేనలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు పవన్ తెలిపారు. అంతేకాదు రాబోయే తరానికి మంచి భవిష్యత్తును ఎలా ఇవ్వాలని ఆలోచిస్తున్న వారిలో విష్ణురాజు ఒకరని, భీమవరం వెళ్లినపుడు ఆయన కాలేజీలను నిర్వహిస్తున్న విధానాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. విధానాల రూపకల్పనలో రాజు ఆలోచనలు ఎంతగానో ఉపకరిస్తాయని భావిస్తున్నానని, ఆయనను కలవడం సంతోషంగా ఉందన్నారు. స్మార్ట్ సిటీలు, పర్యావరణం అంశాలపై ఆయనకు అపారమైన అవగాహన ఉందని, జనసేన విధానాల రూపకల్పనలో ఆయన సలహాలు తోడ్పాటును అందిస్తాయని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
వెంటనే విష్ణురాజును జనసేన విధానాల రూపకల్పన కమిటీ ఛైర్మన్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. పార్టీకి అవసరమైన సేవలు అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సమాజానికి మంచి చేయాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఆలోచనలు ముందుకు సాగుతున్నాయని విష్ణురాజు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే విష్ణు రాజు మాత్రం ఖండించారు. తాను జనసేన పార్టీలో చేరలేదని.. రాజకీయాల్లోకి రాను, ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారాయన. కేవలం అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించానని క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కు నాకు మధ్య ఈ విషయాలపైనే చర్చ జరిగిందన్నారు. అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్, ఆయన పార్టీలో చేరారని చెప్తుంటే, విష్ణు రాజు మాత్రం వారం తిరగకుండానే, జనసేన లో చేరలేదని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది…