అమరావతిలో నూతనంగా నిర్మించిన వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) విశ్వవిద్యాలయం ఈ నెల 28 న ప్రారంభం కానుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. 3 లక్షల 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని నిర్మించారు. ‘విట్’ విద్యా సంస్థల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శేఖర్ విశ్వనాథన్ విజయవాడలో శనివారం మీడియాతో ఈ విషయం చెప్పారు. విట్ అమరావతిలో, 24 రాష్ట్రాలకు చెందిన 630 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు చదువుతున్నారని ఆయన తెలిపారు. అమరావతి పరిధిలో తమకు కేటాయించిన 200 ఎకరాలస్థలంలో ఈ నూతన భవనాల నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరిలో చేపట్టి రికార్డు సమయంలో 3 లక్షల 21 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించినట్లు ఆయన చెప్పారు.
అయితే రేపు విట్ లో రెండు బిల్డింగ్స్ ఓపెన్ చెయ్యనున్నారు.. వాటికీ పేర్లు, ఒకదానికి సర్వేపల్లి రాధాకృష్ణన్, రెండోదానికి సరోజినీ నాయుడి పేర్లు పెట్టారు... సర్వేపల్లి రాధాకృష్ణన్ మన రాష్ట్రం వారు కావటం, మన తెలుగు వారి పేర్లు పెట్టటం మనకు కూడా ఎంతో గర్వ కారణం... అలాగే నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన సరోజినీ నాయుడు పేరు కూడా ఒక బిల్డింగ్ కి పెట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద అకాడమిక్ బ్లాక్, 5 ఫ్లోర్స్ లో, 2,11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, అలాగే సరోజినీ నాయుడు పేరు మీద హాస్టల్ బ్లాక్, 9 ఫ్లోర్స్ లో, 110,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.
విద్యా కేంద్రంగా అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఉన్నత విద్యా కేంద్రంగా మారనుంది. కొన్నేళ్లుగా విజయవాడ, గుంటూరు విద్యాకేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. వీటికి అమరావతి కూడా తోడైతే ఈ ప్రాంతం విద్యా కేంద్రాల హబ్‌గా మారనుంది. అమరావతికి ఒక్క విద్యారంగంలోనే సుమారు రూ.25వేల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయని అంచనా. ఇది కూడా తొలి దశలోనే. ఇప్పటికే వెల్లూరు ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్), ఎస్‌ఆర్‌ఎం, మాతా అమృతానందమయి తదితర సంస్థల వర్సిటీలు నెలకొల్పేందుకు అమరావతిలో భూమిని కేటాయించారు. రాజధాని ప్రాంతంలోని ఐనవోలు, శాఖమూరు ప్రాంతాల్లో వీటికి భూములిచ్చారు. ఇప్పటికే విట్, ఎస్‌ఆర్‌ఎం తరగతులు కూడా ప్రారంభించాయి.