వైఎస్ వివేక కేసులో ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసు, చివరకు వివేక్ కుమార్తె , భార్య కోర్టుకు వెళ్లి, సిబిఐ విచారణ అడగటంతో, ఈ కేసు సిబిఐకు వెళ్ళింది. అయితే సిబిఐ పై కూడా అనేక విమర్శలు వచ్చాయి. చివరకు సునీత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ, సిబిఐ సరిగ్గా పని చేయటం లేదని చెప్పటంతో, కొన్ని రోజులకే సిబిఐ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. తరువాత దూకుడు మీద సిబిఐ ఆఫీసర్ సుధా సింగ్ ను ట్రాన్స్ఫర్ చేసారు. అప్పటి వరకు రోజుకి ఒక వార్త బయటకు వస్తూ ఉండేది, ఆమె సదన్ గా ట్రాన్స్ఫర్ అవ్వటంతో, మళ్ళీ కేసు విచారణలో వేగం తగ్గింది అనే భావన నెలకొంది. చివరకు సిబిఐ పత్రికా ప్రకటన కూడా ఇచ్చి, కేసు గురించి వివరాలు చెప్తే, డబ్బులు ఇస్తాం అంటూ కూడా ప్రకటన చేసింది అంటే, పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే తరువాత సిబిఐ కొన్ని అరెస్ట్ లు చేసింది. అయినా సునీత చెప్పిన కొన్ని పేర్లను ఇప్పటికీ సిబిఐ విచారణ చేయలేదు. అందులో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు. మరి సిబిఐ వారిని ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేయలేదో తెలియదు కానీ, తాజాగా నిన్న జరిగిన ఒక సంఘటనతో, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకోవటంతో, ఈ కేసు మరో సారి వార్తల్లో నిలిచింది.
వివేక కేసులో అరెస్ట్ అయిన వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి, అప్రువర్ గా మారటానికి సిద్ధం అయ్యారు. దస్తగిరి అప్రువర్ గా మారటానికి సిద్ధం అయ్యారని, తమకు విచారణలో పూర్తి సహకారం అందిస్తున్నారని, దస్తగిరి సాక్ష్యం నమోదు చేయాలి అంటూ సిబిఐ అధికారులు కడప కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ వేసిన ఈ అప్రువర్ పిటీషన్ పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పటికే వివేక కేసులో దస్తగిరి కీలకమైన వ్యక్తిగా సిబిఐ చెప్తుంది. మరి అప్రువర్ గా మారిన దస్తగిరి ఏమి విషయాలు చెప్తారు, ఎవరు పేర్లు చెప్తాడు, పెద్ద తలకాయలు బయటకు వస్తాయో లేదో చూడాలి. ఎందుకంటే దస్తగిరి లాంటి సామాన్య డ్రైవర్ కి పులివెందులలో, సంత ఇంట్లో వైఎస్ ఫ్యామిలీ మీదకు వెళ్ళే సాహసం ఉండదు. అసలు ఆ అవకాశమే ఉండదు. ఎవరో వెనుక ఉండి నడిపిస్తే కానీ చేయడు. మరి తన అప్రువర్ పిటీషన్ లో, ఏ అంశాలు చెప్తాడు, ఎవరి పేర్లు చెప్తాడు అనేది చూడాలి. అసలు ఈ అప్రువర్ పిటీషన్ ను కోర్టు అంగీకరిస్తుందా, అనేది కూడా ప్రశ్న. చూద్దాం ఏమి జరుగుతుందో.