మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. దిగువ కోర్టు తమను పోలీసు కస్టడీకి ఇవ్వడాన్ని సవాలు చేస్తూ వివేకా వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, ప్రకాష్ అనే నిందితులు శనివారం హైకోర్టులో హౌజ్ మోషన్ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి విచారణ చేశారు. పోలీసు కస్టడీకి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించారు. అయితే ఇకపైన చేపట్టే విచారణ ప్రక్రియను వీడియో రికార్డు చేసి సీడీ రూపంలో దిగువ కోర్టులో దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడిఉండగా ఆ రక్తపు మరకలను తుడిచేశారని, అసలు నిందితులను రక్షించడానికి సాక్ష్యాలను కనుమరుగు చేశారనేే ఆరోపణలపై గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పోలీసుల అభ్యర్థన మేరకు వీరిని దిగువ కోర్టు ఈనెల 4 నుంచి 8 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని పేర్కొంది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కృష్ణారెడ్డి, ప్రకాష్‌లు శనివారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీకి అప్పగించడం తమ హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ హత్య గురించి ఫిర్యాదు చేసింది పిటిషనర్లేనని, అసలు నిందితులు ఎవరనేది వాళ్లకు తెలుసనని అభిప్రాయపడ్డారు. దర్యాప్తునకు సహకరించకుండా మౌనం వహించడం తగదన్నారు. వాస్తవాలు రాబట్టేందుకు పోలీసు కస్టడీ అవసరం అని చెప్పారు. ఆ వాదలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కస్టడీకి ఇస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలువరించడానికి నిరాకరించారు. అనుబంధ పిటిషన్ కొట్టేశారు.