వివేక కేసు అనేక కీలక మలుపులు తిరుగుతూ వెళ్తుంది. సిబిఐ కేసు విచారణలో అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు సిబిఐ కేసు విచారణ స్పీడ్ అందుకుంది. ఈ కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో ఐజి స్థాయి అధికారి రాలేదు. మొదటి సారిగా సిబిఐలో ఐజి స్థాయి అధికారి, ఢిల్లీ నుంచి వచ్చి, ఇక్కడ కేసు విషయం పై ఆరా తీసారు. డీఐజీ చౌరాసియా నిన్న ఢిల్లీ నుంచి కడప వచ్చారు. కడపలో కేంద్ర కారాగారం అతిథిగృహంలో , డీఐజీ చౌరాసియా విచారణ అధికారులతో కలిసి, ఈ కేసు వివరాలు, విచారణ తీరు అడిగి తెలుసుకున్నారు. అయితే త్వరలోనే ఈ కేసులో కీలక అరెస్ట్ లు ఉండబోతున్నాయి అనే ప్రచారం సాగుతున్న సందర్భంలో, ఐజి స్థాయి అధికారి రావటంతో, త్వరలోనే ఈ కేసులో ఏదో పెద్ద అడుగు పడబోతుంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో పక్క సిబిఐ అధికారులు, మరోసారి దస్తగిరి స్టేట్మెంట్ రికార్డు చేయటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పులివెందుల కోర్టులోనే ఈ ప్రక్రియ సాగనుంది. ఇప్పటికే ఒకసారి దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, సిబిఐ ఇప్పటి వరకు అనేక మందిని విచారణ చేసి, కొంత మందిని అరెస్ట్ చేసింది కూడా. అయితే ఈ నేపధ్యంలో సిబిఐ వేసిన చార్జ్ షీట్, హాట్ టాపిక్ అయ్యింది.
ఆ చార్జ్ షీట్ లో, ఏకంగా అవినాష్ రెడ్డి పేరు పెట్టి, అతన్ని అనుమానితుడుగా కూడా సిబిఐ పేర్కొంది. అంతే కాదు, చార్జ్ షీట్ లో పలు విషయాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అవినాష్ రెడ్డి వచ్చిన తరువాత, గుండెపోటు డ్రామా మొదలు పెట్టారని సిబిఐ చెప్పింది. అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి, అక్కడ ఆధారాలు అన్నీ తుడిచి వేయించాడని, అలాగే వివేకకి కుట్లు కూడా వేసారని సిబిఐ తెలిపింది. ఇక మరో విషయంగా, కడప ఎంపీ సీటు విషయం పైన, కుటుంబంలో పెద్ద చర్చ నడుస్తూ వచ్చిందని, అందులో వివేక, అవినాష్ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇవ్వటానికి ఒప్పుకోలేదని, ఇస్తే తనకు, లేదా విజయమ్మకు, లేదా షర్మిలకు ఇవ్వాలని పట్టుబట్టారని, అయితే అవినాష్ రెడ్డి, వివేక పై కక్ష పెంచుకుని, తన మనుషుల చేత, వివేకను చం-పిం-చా-రు అనే అనుమానం కూడా ఉందని, సిబిఐ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారం నేపధ్యంలో, ఢిల్లీ నుంచి సిబిఐ ఐజి స్థాయి అధికారి ఇక్కడకు రావటంతో, ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది.