జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయ్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన వైఎస్ వివేక కేసు మిస్టరీ ఇంకా ఇంకా సాగుతూనే ఉంది. ఈ కేసులో ఉన్న ట్విస్ట్ లు, ఏ తెలుగు సీరియల్ లో కూడా ఉండవు అంటే అతిశయోక్తి కాదేమో. వైఎస్ వివేక కేసుని మొదట చంద్రబాబు మీద తోసేసారు. తరువాత నెమ్మదిగా ఈ కేసులో ట్విస్ట్ లు మొదలు అయ్యాయి. ముందుగా జగన్ మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కావాలని గతంలో అడగటం, తరువాత వెనక్కు తీసుకోవటం హైలైట్. అక్కడ నుంచి సిబిఐ విచారణ వరకు ఈ కేసు సాగుతూనే ఉంది. తాజాగా రెండు రోజుల క్రిందట, వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్, తెలుగు రాజకీయాల్లో సంచలనం అయ్యింది. వివేక కేసు విషయంలో అనేక అనేక విషయాలు బయట పడ్డాయి. మరీ ముఖ్యంగా వైఎస్ కుటుంబం నుంచి ముగ్గురు పేర్లు ఇందులో బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. వైఎస్ అవినాష్ రెడ్డి దీని వెనుక ఉన్నట్టు, ఎర్ర గంగి రెడ్డి చెప్పాడు అంటూ దస్తగిరి కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ ప్లాన్ మొత్తానికి సుపారీ రూ.40 కోట్లు అని తేల్చారు. రూ.40 కోట్లు అంటే మామూలు విషయం కాదు, దీని వెనుక ఎంత పెద్ద పెద్ద చేతులు లేకపోతే 40 కోట్లు ఇస్తారు అనేది కూడా ఇక్కడ పెద్ద ప్రశ్న.
గత రెండు రోజులుగా ఈ వార్తలు హోరెత్తుతున్నాయి. అన్ని టీవీ చానల్స్ లో ఈ విషయం పై ప్రముఖంగా వార్తలు వచ్చాయి. బ్లూ మీడియా మాత్రం, ఇది పట్టించుకోలేదు, అది వేరే విషయం. అయితే ఇంత గోల జరుగుతున్నా వైసీపీ నుంచి కానీ, అవినాష్ రెడ్డి వైపు నుంచి కానీ, ఎవరి నుంచి కూడా ఈ విషయం పై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఎట్టకేలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. తెలుగుదేశం పార్టీ దీని పైన అనవసరంగా గోల చేస్తుందని, ఏ విషయం జరిగినా దాన్ని రాజకీయాలకు ముడి పెడుతున్నారని, వివేక కేసుని రాజకీయాలకు ముడి పెట్టవద్దు అని కోరుతున్నాం అని అన్నారు. వివేక చనిపోయిన క్షణాన దుఃఖంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, సిబిఐ విచారణ అడిగారని, అప్పట్లో కర్ణటక నుంచి కూడా వ్యక్తులు వచ్చారని సమాచారం ఉండటంతో, అప్పట్లో సిబిఐ విచారణ కోరినట్టు చెప్పారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని, అంతే కాని ప్రతి విషయం రాజకీయాలకు ముడి పెట్టవద్దు అంటూ టిడిపి నేతల పై విమర్శించారు.