మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే.. వివేకాను కిరాయి హంతకులతో హత్య చేయించినట్లుగా పోలీసులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గానూ కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీంతో కిరాయి హంతకులను పట్టుకోవడం పోలీసులు, సిట్ బృందాలకు పెను సవాల్‌గా మారింది. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో ఈనెల 15న వివేకా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య వెనక ఉన్నదెవరు..ఏమి ఆశించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.. తదితర కారణాలను పూర్తిస్థాయిలో బయట పెట్టేందుకు సిట్ బృందం, పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే మాజీ మంత్రి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, డ్రైవర్ ప్రసాద్‌తో సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని 5రోజులుగా సిట్ విచారిస్తోంది. ఈక్రమంలోనే వివేకా హత్య వెనుక సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన పరమేశ్వరరెడ్డి ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలిందని విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంతోనే ఆయన్ని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది జరిగి 24 గంటలు గడవక ముందే మరికొందరి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో మంగళవారం సింహాద్రిపురం మండలం దిద్దెకుంట గ్రామానికి చెందిన శేఖరరెడ్డితోపాటు అతని అనుచరులైన మరో నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని కడపకు తరలించినట్లు సమాచారం. వీరితోపాటు వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన రాగిపిండి సుధాకరరెడ్డిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకా హత్య ఇంటి దొంగల పనే అని మీడియా ఎదుట పరమేశ్వరరెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. తొలుత వివేకా గుండెపోటుతో మృతి చెందాడని ఎలా నిర్ధరణ చేశారు? స్నానపుగదిలో ఉన్న మృతదేహాన్ని పడక గదిలోకి ఎందుకు తీసుకొచ్చారు? గదిలో ఉన్న రక్తపు మరకలను ఎందుకు తుడిచేశారు? మృతదేహంపై ఉన్న గాయాలకు బట్ట ఎందుకు కట్టారు? పోలీసులకు సమాచారం ఆలస్యంగా ఎందుకిచ్చారు? వంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పటికే దొరకలేదు.
ఇందుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి సమీప బంధువులు వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకరరెడ్డి, జనార్దనరెడ్డిలను స్థానిక మైదుకూరు డీఎసీˆ్ప శ్రీనివాసులు విచారించారు. రాజకీయంగానా, వ్యాపార లావాదేవీలా..మరేదైనా కారణం వల్ల హత్య చేశారా..అనే కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. బెంగళూరులో రూ.వందల కోట్లు విలువ చేసే స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపించాలంటూ అదుపులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలిసినప్పటికీ ఆధారాల కోసం దర్యాప్తు మరింత ముమ్మరం చేశారని సమాచారం. హత్య కేసు విచారణలో భాగంగా కొంతమంది అనుమానితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని కడపలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఇప్పటికే వారిని అదుపులోకి తీసుకుని నాలుగు రోజులు పూర్తవడంతో వారందరి నివాసాల నుంచి మంగళవారం దుస్తులు సేకరించి.. కడపలో వారికి అందజేసినట్లు తెలిసింది.