వైఎస్ వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం ఎందుకు చేశారని, బెడ్‌రూమ్‌లో రక్తాన్ని ఎవరు, ఎందుకు తుడిచారు.. వంటి అంశాలకు వైకాపా అధినేత జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బయిట వ్యక్తి హత్యకు గురైతే సాక్ష్యాలను కాపాడుతామని, ఇంట్లో మనిషి కావడంతో సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉదయం ఈ విషయం తెలియగానే తాను బాధ పడ్డానని, ఆ తరువాత వివేకా కుటుంబ సభ్యులు డ్రామా ఆడటం ప్రారంభించారన్నారు. ఉదయం 5.30 గంటలకు ఇంటికి వెళ్తే, తలుపు తీయకపోతే వెనుక నుంచి తీశారని, అప్పటికే బాత్ రూమ్‌లో వివేకానంద రెడ్డి పడి ఉన్నారని తెలిపారు. ఉదయం 6.30 గంటలకు అవినాష్‌రెడ్డి వచ్చారని తెలిపారు. పోలీసులకు పోన్ చేశారని, అప్పుడు కూడా హత్య అని చెప్పకుండా గుండెపోటు అని, ఆసుపత్రికి తరలించారని ఆరోపించారు.
శవాన్ని బెడ్‌రూమ్ నుంచి బాత్ రూమ్‌కు, బాత్‌రూమ్ నుంచి బెడ్‌రూమ్‌కు ఎవరు, ఎందుకు తరలించారో చెప్పాలన్నారు. అంతపెద్ద నేరం జరిగితే కీలకమైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను ఎందుకు మాయం చేసే ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. శవాన్ని ఆసుపత్రికి తరలించి అక్కడ కూడా గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని, మెదడు బయటకు వచ్చేంత గాయం అయితే అది హత్యో, గుండెపోటో తెలియదా అని ప్రశ్నించారు. హత్య జరిగినప్పుడు పంచనామా జరపకుండా శవాన్ని ఎలా ఆసుపత్రికి తరలిస్తారని అన్నారు. బెడ్‌రూమ్‌లో తలకు గాయం తగిలిందని గుడ్డ కట్టారని, ఆ తరువాత ఆసుపత్రికి తరలించడం వంటివి చేశారన్నారు. హత్యగు గురైంది వారి కుటుంబ సభ్యుడని, ఎందుకు సాక్ష్యాలను మాయం చేసే ప్రయత్నం చేశారని, ఎవరిని కాపాడేందుకు ఈ వ్యవహారాలన్నీ చేశారని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు 8 గంటలకు ఇచ్చారన్నారు. ఉదయం 5.30కు తెలిస్తే, చాలా సేపటి తరువాత ఫిర్యాదు ఇచ్చారన్నారు. అక్కడ ఉన్న సీఐ కూడా శవాన్ని తరలించడానికి సహకరించడంపై విచారణ చేయాల్సి ఉందన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జగన్, అతని కుటుంబ సభ్యుల స్వరంలో మార్పు వచ్చిందని తెలిపారు.
వాస్తవాలను బయటకు రాకుండా చేసి, రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారన్నారు. కేసును పరిశీలిస్తే చాలా సందేహాస్పదంగా ఉందన్నారు. కుటుంబ సభ్యుడు హత్యకు గురైనా గుండెపోటు అని నమ్మించే ప్రయత్నం చేశారన్నారు. జగన్ తన ఇంట్లో జరిగిన నేరానికి సాక్ష్యాలు లేకుండా మాయం చేయడం ద్వారా ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు వివరించాలన్నారు. లేఖ ఎవరు రాశారు, ఉదయం లేనది సాయంత్రం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ పరిస్థితుల్లో లేఖ రాసే వీలు ఉంటుందా అని సందేహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అందరూ చూశాక కూడా హత్య కాదని నమ్మించే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పుడు సీబీఐ విచారణ అడుగుతున్నారని, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేసి, ఇప్పుడు తప్పించుకునేందుకు సీబీఐ విచారణ అడుగుతున్నారన్నారు. సీబీఐ అయితే వీరు చెప్పినట్లు వినే వీలు ఉందని అడుగుతున్నారన్నారు. కుటుంబ సభ్యుడు హత్యకు గురైతే సాక్ష్యాలను లేకుండా చేయడం కరడు కట్టిన నేరస్థులే చేయగలరన్నారు. హత్యను సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేశారన్నారు. ఇలా ఎందుకు చేశారో జగన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సాక్ష్యాలను తారుమారు చేసి రాజకీయానికి వాడుకుంటారా అని ప్రశ్నించారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే ఆదేశించానని తెలిపారు.