మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా సిట్ అధికారులు కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసాన్ని బుధవారం మరోమారు తనిఖీ చేశారు. స్నానపు గది, పడక గదిని మైదుకూరు డీఎసీˆ్ప శ్రీనివాసులు పరిశీలించారు. మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిని విచారించారు. మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? మృతికి సంబంధించిన సమాచారాన్ని మీకు మొదట ఎవరిచ్చారు? ఏ విధంగా చనిపోయినట్లు చెప్పారు? వంటి విషయాలను ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డిని కూడా డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి సిట్ అధికారులు విచారించారు.
దర్యాప్తులో భాగంగా మంగళవారం సింహాద్రిపురం మండలంలోని దిద్దెకుంటకు చెందిన శేఖరరెడ్డి, అతని అనుచరులు నలుగురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం శేఖరరెడ్డి భార్య లక్ష్మిదేవి విలేకర్లతో మాట్లాడారు. ‘వివేకాతో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వివేకా అనుచరుడు పరమేశ్వరరెడ్డితో నా భర్తకు గతేడాది నుంచి మాటలు లేవు. లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తి మాకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. అతను ఎంతకూ ఇవ్వకపోవడంతో పరమేశ్వరరెడ్డి పంచాయితీ చేశారు. ఇందులో భాగంగా అతను రూ.5 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పడంతో..నా భర్త ఒప్పుకున్నారు.
ఆ నగదును లక్ష్మీనారాయణరెడ్డి... పరమేశ్వరరెడ్డికి చేతికి అందజేశారు. కానీ, ఆ డబ్బును తన భర్తకు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో ఇరువురి మధ్య మాటలు లేవు. డబ్బులు ఇవ్వాలని పరమేశ్వరరెడ్డికి నా భర్త పలుమార్లు ఫోనే చేసేవారు. ఈక్రమంలో నా భర్త తెదేపాలోకి చేరడంతో.. ఉద్దేశపూర్వకంగా కుట్ర చేసి ఈ హత్య కేసులో ఇరికించే యత్నం చేస్తున్నారు’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.