టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఉన్న అత్యున్నతమైన ఆస్తి యువతేనని అన్నారు. అందుకే వారిని ప్రోత్సహించేందుకు నిరుద్యోగ భృతి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరంలో నిర్వహించిన రోడ్‌షోలో నిరుద్యోగ భృతిపై మాట్లాడుతూ... ఇప్పుడు నిరుద్యోగులకు ఇస్తున్న రూ.2వేలకు మించి ఎక్కువ భృతిని చెల్లిస్తామని ప్రకటించారు. యువతకు తానే ఓ సంరక్షుడిగా ఉంటానని..అన్నారు. అంతేకాకుండా అభివృద్ధిని అడ్డుకొనేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని, అంతేకాకుండా టీడీపీ నాయకుల ఆస్తులపై ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి వీధిలో ఒక రౌడీ తయారవుతారని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే విజయనగరం జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదని.. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్లే తనకు శత్రువులని పేర్కోన్నారు.
‘‘ఉత్తరాంధ్రను అగ్రగామిగా నిలిపేందుకు తగిన ప్రణాళికను రూపొందించాం. గోదావరి-పెన్నా-నాగావళి-వంశధార-బాహుదా నదులను అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తాం. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జులై నాటికి గ్రావిటీ ద్వారా విశాఖపట్నంకు నీళ్లిస్తాం. ఇప్పుడున్న ప్రజల తలసరి ఆదాయం రూ.1.65 లక్షల నుంచి రూ.3.50 లక్షలకు పెంచి, పెరిగిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చిస్తాం. అభివృద్ధిని 13 జిల్లాల్లోనూ వికేంద్రీకరిస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున పోటీచేస్తున్న లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. సాలూరు సభలో అరకు పార్లమెంటు అభ్యర్థి వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్, సాలూరు అసెంబ్లీ అభ్యర్థి ఆర్.పి.భంజ్‌దేవ్, మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు; చీపురుపల్లి సమావేశంలో విజయనగరం తెదేపా ఎంపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
‘‘నన్ను చూస్తే పరిశ్రమలు వస్తాయి. జగన్‌ని చూస్తే పరిశ్రమలు పారిపోతాయి. నేను అధికారంలో ఉంటే అనుమతులు సులభంగా వస్తాయని, పెట్టుబడులు పెడితే ఇబ్బందులుండవని అందరూ నా దగ్గరకు వస్తారు. అదే జగన్ అయితే వారి నుంచి వాటాలు తీసుకోవడమే కాకుండా వారిని జైలుకి తీసుకుపోతారు. ఐఏఎస్ అధికారులు, పారిశ్రామికవేత్తలు అలాగే జైలుకి వెళ్లారు. యువతకి నేను చెప్పేది ఒకటే. వైకాపాకు సహకరిస్తే మీకు తెలియకుండానే నేరాల్లో ఇరికించి జైల్లో పెట్టిస్తారు. ఆ పార్టీయే ఓ నేరాల చిట్టా. ఆంధ్రప్రదేశ్‌లో మేం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావట్లేదు. గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయేవరకూ ప్రతి దశలోను సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. రాబోయే రెండేళ్లలో ప్రతిఇంటికీ కుళాయి ద్వారా నీరిస్తాం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.