ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దంపట్టేలా విశాఖ ఉత్సవ్ పేరుతో ఏటా ఏపీ ప్రభుత్వం వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా విశాఖ ఉత్సవాలు శుక్రవారం నుంచి (డిసెంబరు 28) ప్రారంభంకానున్నాయి. ఈ ఉత్సవాలను అంగరంగా వైభవంగా నిర్వహించేందుకు పర్యటక శాఖ భారీ ఏర్పాట్లను చేసింది. శుక్రవారం సాయంత్రం సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవ్‌ను ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా సెంట్రల్ పార్క్‌లో భారీ పుష్ప ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందుకోసం బెంగళూరు, కడియం సహా వివిధ ప్రాంతాల నుంచి పూల మొక్కలను తీసుకొచ్చారు. అలాగే సంగీత, సాంస్కృతిక, జానపద కళారూపాల నిర్వహణ, ప్రదర్శన కోసం బీచ్‌రోడ్డులో రెండు ప్రధాన వేదికలను ఏర్పాటుచేశారు. అలాగే చిన్నారుల కోసం అమ్యూజ్మెంట్ జోన్ కూడా ఏర్పాటు చేశారు.
అయితే ఇదే ఉత్సవాల్లో, ఈ రోజు నిర్వహించే విశాఖ ఉత్సవ్ లో విశాఖ తీరంలో 9 యుద్ద విమానాలతో చేసే ఎయిర్ షోను కేంద్రం రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన 90 మంది వాయుసేన సిబ్బందిని వెనక్కు రావాలని ఆదేశించింది. ఎయిర్ షోకు మొదట అనుమతి ఇచ్చిన కేంద్రం ఆ తరువాత వెనక్కి తీసుకుంది. విశాఖ చేరుకున్న సిబ్బందిని రక్షణ శాఖ వెనక్కి రప్పించింది. మోదీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే ఎయిర్ షోకు అనుమతి ఇవ్వలేదంటూ టీడీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమన్వయ లోపాలే కేంద్రం నుంచి అనుమతులు రాకపోవడానికి ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. గత వారం ఎయిర్ షో నిర్వాహకులు విశాఖపట్నం వచ్చి ఆర్కే బీచ్, ఇతర ప్రాంతాలను పరిశీలించి నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసి, వాయుసేన సిబ్బందిని రిహార్సల్స్ పూర్తి చేశాక వెనక్కు పిలిపించింది కేంద్రం.
వాయుసేన సిబ్బంది విశాఖ ఉత్సవ్ లో పాల్గొనకుండా వెళ్లిపోవడానికి కేంద్రమే కారణమని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఇదే విషయం పై పార్లమెంట్ ఆవరణలో, ఎంపీలు ఆందోళన చేసారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. జానపద నృత్యాలు, ట్రైబల్ జోన్, అడ్వెంచర్లు, కార్నివాల్ పెరేడ్ తదితర కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ధాన వేదికను ఒకేసారి 50 మంది కళాకారులు ప్రదర్శన ఇచ్చేలా తీర్చిదిద్దారు. విద్యుత్తు, రేడియం దీపాలతో దీనిని అలంకరించారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రత్యేకాధికారులకు ప్రత్యేక గ్యాలరీ మినహా మిగతా ప్రాంతాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఉంచారు. ప్రత్యేక స్టాళ్ల కోసం 200కుపైగా డేరాలను ఏర్పాటు చేశారు. బీచ్‌లో పదికిపైగా దేవాలయాల నమూనాలను తీర్చిదిద్దారు. సింహాచలం వరాహలక్ష్మీనర్సింహస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, కన్యకాపరమేశ్వరి, ఇతర ఆలయాల నమూనాలను సిద్ధం చేశారు.