ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం రివర్స్ ట్రెండ్ లో వెళ్తుంది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న తరుణంలో విమాన సర్వీసులు పెరగాల్సి ఉండగా అందుకు భిన్నంగా తగ్గుతూ వస్తున్నాయి. విమానయాన సంస్థలు ఏ మార్గంలో డిమాండ్ ఉందో చూసుకుని ఆ వైపునకు సర్వీసులు మళ్లించి విశాఖకు సేవలను నిలిపివేస్తున్నాయి. దీంతో నిలిపివేస్తున్న విమాన సర్వీసుల సంఖ్య క్రమంగా పెరిగి పోతోంది. దీని పై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికులు సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం ఫలితం కనిపించటం లేదు. శ్రీలంక ఎయిర్లైన్స్ తన సర్వీసు అంత లాభాదాయకంగా లేకపోవటంతో రద్దు చేసుకుంది. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అందించాల్సిందిగా కోరితే ప్రభుత్వం స్పందించలేదు.
అయితే విశాఖతో శ్రీలంకకు వాణిజ్య సంబంధాలు ఉండటంతో అక్కడి విమానయాన సంస్థ ఒకటి 14 మంది ప్రయాణించే చిన్న విమానాన్ని నడిపేందుకు ముందుకు వచ్చింది. ఈ సర్వీసు త్వరలో ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ ఎయిర్ అలయెన్స్ ఇటీవల విశాఖపట్నం-విజయవాడ-తీరుపతి విమానాన్ని రద్దు చేసింది. ఎయిర్ ఇండియా చైర్మన్న ఢిల్లీలో విమాన ప్రయాణికుల సంఘం కలిసి విన్నవించినా ఆ సర్వీసును పునరుదరించ లేదు. విశాఖపట్నం నుంచి కొచ్చిన్ వెళ్లే సర్వీసును కూడా ఇటీవల రద్దు చేశారు. మరోవైపు స్పైస్ జెట్ కూడా కోల్కతా విమాన సర్వీసును ఉపసంహరించుకుంది. ఇండిగో బెంగళూరుకు నడిపే రెండు విమానా లను రద్దు చేసింది.
జెట్ ఎయిర్ వేస్ సంక్షోభంతో ఢిల్లీ, ముంబై సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్. హైదరాబాద్, చెన్నై నగరాలకు ఆగస్టు నుంచి సర్వీసులను నిర్వహించటం లేదంటూ టికెట్లను విక్రయించటం లేదు. నెల రోజుల పాటు విమాన సర్వీసులు అందుబాటులో లేవని చెబుతున్నారని ట్రావెల్స్ ఏజెన్సీలు వెల్లడించాయి. ఆ తర్వాత ఈ సర్వీసులను కొనసాగిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేమని అంటున్నారని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఇలాగే అన్ని కీలక సర్వీసులు రద్దు చేసుకుంటూ పోతున్నారు. సింగపూర్ విమానం రద్దు అయిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ, హైదరాబాద్ కు సర్వీసులు తగ్గించేసారు. దీని పై చంద్రబాబు కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి అయినా, హైదరాబాద్ నుంచి వెళ్ళేలా జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని, చంద్రబాబు విమర్శిస్తున్నారు.