విశాఖలో కరోనా బాధితుల సంఖ్య 4కు పెరిగింది. ఇప్పటికే కరోనా వచ్చిన వ్యక్తి బంధువుకే తాజాగా వైరస్‌ సోకినట్లు తేల్చారు. అందుకే విదేశాల నుంచి వచ్చిన వారినిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు 112 అనుమానితులకు పరీక్షలు చేయగా 4 గురికి పాజిటివ్.. 96 మందికి నెగటివ్ వచ్చింది. మరో 12 మంది ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. విమ్స్ ను కోవిడ్ -19ఆస్పత్రిగా మార్చి తూర్పుగోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన పాజిటివ్‌ కేసులకు చికిత్స అందిస్తున్నారు. పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రి , గీతం వైద్య కళాశాల ఆసుపత్రులు కోవిడ్ ఆసుపత్రులుగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే 3 వేల 500 క్వారంటైన్ పడకలు సిద్ధం చేశారు. వేరే రాష్ట్రాలనుంచి రాష్ట్ర వాసులు వస్తే నిర్బంధ కేంద్రాన్ని వేపగుంటలో సిద్ధం చేశారు.

విశాఖకు 2 వేల 795 మంది విదేశాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. జీవీఎంసీ పరిధిలో 2 వేల 224 మంది, గ్రామీణ ప్రాంతాల్లో 571 మంది ఉన్నట్లు గుర్తించారు. సీతమ్మధార, అల్లిపురం, గాజువాక, అనకాపల్లి గ్రామీణ పరిధిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. 97 బృందాలు నిరంతరం పనిచేసి... అనుమానితులను పరీక్షలకు తరలించే పని చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులపై ప్రత్యేక నిఘా పెట్టారు. 21 మందితో జిల్లా కమిటీ వివిధ చర్యలు తీసుకుంటోంది. విశాఖలోని కరోనా కేసుల పరీక్షలకోసం నిర్దేశించిన ఛాతీ ఆసుపత్రిలో సౌకర్యాల లేమిపై ఒక వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ఈ వీడియోపై స్పందించిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌... లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లిని హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించినందున... విశాఖలో కరోనా పరీక్షా కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎం జగన్‌కు లేఖ రాశారు. విశాఖలో ఐసోలేషన్ వార్డులను మరిన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వైద్య సిబ్బందిని మరింత పెంచాలన్నారు. కనీసం ఒక వైద్య బృందాన్ని ప్రతి వార్డులోనూ ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్తు బిల్లులు, మున్సిపల్​ పన్నులు, నీటి బిల్లులు రద్దు చేయాలని సీఎంని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కోరింది. ఈమేరకు లేఖ రాసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read