ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై విశాఖ సీపీ మహేష్‌చంద్ర లడ్డా పురోగతిని వివరించారు. ఈ కేసులో ఆయన కీలక ఆధారాలు వెల్లడించారు. జగన్ పై కోడి కత్తి గుచ్చుడు చేసిన నిందితుడని కోర్టులో ప్రవేశపట్టామని తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ… నిందితుడు ఎయిర్ పోర్టులో ఇతర సామాగ్రితో కలిపి కత్తిని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడని తెలిపారు. నిందితుడి వద్ద దొరికిన ఉత్తరంలో 9వ పేజీని ఆయన బాబాయి కూతురు జే.విజయలక్ష్మీ (16)తో ఇటీవల ఊరికి వెళ్లినప్పుడు రాయించాడని వివరించారు. మరో పేజీని రెస్టారేంట్ లో పనిచేసే తోటి ఉద్యోగి రేవతీపతి(19)తో రెండు రోజుల క్రితం రాయించాడని తెలిపారు.
రేవతిపతిది శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోలి గ్రామమని తెలిపారు. అతడు 10వ తరగతి చదివి అటెండర్ గా రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. రెండు రోజుల క్రితమే అతడితోనే జిరాక్స్ తెప్పించాడన్నారు. నాలుగు నెలలుగానే పని… నిందితుడి వద్ద ఉన్న కత్తిని అప్పుడప్పుడు రెస్టారెంట్ లో పండ్లు కోయడానికి ఉపయోగించేవాడని తెలిపారు. నిందితుడి వద్ద మరో చిన్న కత్తి కూడా దొరికిందని వివరించారు. రెస్టారెంట్ యాజమాని హర్షవర్ధన్ స్టేట్ మెంట్ తీసుకున్నామని, నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్ కి పంపించనున్నట్లు తెలిపారు.
దాడికి వాడిన కత్తి కోడిపందేలుకు వాడిందని, ఆ కత్తి పొడవు 8సెం.మీలు ఉండగా.. ఆ కత్తిలో వాడిగా ఉన్న భాగం మూడు సెం.మీలేనని వివరించారు. నిందితుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని, శ్రీనివాస్ ఏడాది కాలంలో తొమ్మిది సెల్‌ఫోన్లు మార్చి వాటిలో ఒకే సిమ్‌ను వాడాడని, అలా ఎందుకు చేశాడనేది విచారిస్తున్నట్టు సీపీ వెల్లడించారు. నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామంలోనూ విచారణ జరుపుతున్నామని, స్వగ్రామంలో నిందితుడు శ్రీనివాసరావుపై ఓ గొడవ కేసు ఉన్నట్టు తేలిందని, ఘటనపై విచారణ కొనసాగుతోందని లడ్డా చెప్పారు.