గుజరాత్‌లోని నర్మదా సరోవర్ ప్రాజెక్టు కాలువపై 750 మీటర్ల పొడవునా ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఉండేది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయిన రోజులు ఉన్నాయి. గత ఏడాది కేరళలోని బాణాసుర సాగర్ జలాశయంలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రం ప్రారంభమైంది. దీని సామర్థ్యం 500 కేడబ్ల్యూపీ. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ గా ఇది రికార్డు సృష్టించింది అయితే ఇప్పుడు, ఈ రికార్డులన్నీ మన రాష్ట్రం తిరగరాసింది. నీటి ఉపరితలంపై నాలుగు ఎకరాల విస్తీర్ణం, రెండు మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ‘ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ’ విశాఖలో వెలుగులు విరజిమ్ముతోంది! ఇంత భారీ ప్రాజెక్టు కేవలం నాలుగు నెలల్లో సిద్ధమైంది.
సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు భూమి అత్యంత కీలకం. కానీ... విశాఖలో భూముల లభ్యత తక్కువగా ఉండడంతో ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ ప్యానళ్లు అమర్చాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు మరో 12 కార్యాలయాల భవనాలపైనా, 148 పాఠశాలల భవనాలపైనా సోలార్ పలకలు అమర్చారు. వీటిద్వారా సుమారు 4.6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇది ఇంతటితో ఆగలేదు. విశాఖ నగరానికి తాగునీరు అందించే ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటిపై తేలియాడే (ఫ్లోటింగ్) సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రూ.11.36 కోట్ల వ్యయంతో ముడసర్లోవరిజర్వాయర్‌పై పూర్తి చేసిన ఈ ప్లాంటును గతనెల 23న ముఖ్యమంత్రి ప్రారంభించారు. ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటిపైనే సోలార్ ప్యానళ్లు తేలియాడుతూ కనిపిస్తాయి. ఇది దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. నీటిమట్టానికి అనుగుణంగా ప్యానళ్లు కిందికి, పైకి వచ్చేస్తాయి. సోలార్ ప్యానళ్లు తడిచినా తుప్పుపట్టకుండా జర్మన్ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానళ్లు ఉపయోగించారు. నీటిపై రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్ వెడల్పు కలిగిన 6,400 ప్యానళ్లు అమర్చారు.