విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలంటూ పరిశ్రమ వద్ద ధర్నాకు దిగారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను తరలించాలని స్థానికులు నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న స్థానికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొందరిని అరెస్టు చేశాక.. మరికొందరు గేటు వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పరిశ్రమ వద్దకు డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకుని..ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు. పరిశ్రమ చుట్టు పక్కల తాగునీరు కలుషితమైందని...ప్రమాదం తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు వాపోయారు. కరోనా భయం వల్ల బంధువులు కూడా ఇంటికి రానివ్వడంలేదన్నారు. ఎవరు గట్టిగా మట్లాడినా పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమ గ్రామంలోకి వచ్చి పరిస్థితిని పరిశీలించాలని కోరారు. ప్రమాద ఘటన పై పరిశ్రమ యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
బాధితుల చికిత్సకు డబ్బు చెల్లించాలని కొన్ని ఆస్పత్రులు అడుగుతున్నాయన్నారు. ప్రభుత్వం వేసిన కమిటీ...బాధిత 5 గ్రామాల్లో తిరిగి ప్రజలతో మాట్లాడాలని వారు కోరారు. బాధిత 5 గ్రామాల్ల ఆక్సిజన్ స్థాయి పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణం సహాయచర్యలు చేపట్టకుంటే ఇక్కడకు ఎవరూ రారన్నారు. గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రమాదం జరిగినప్పుడు సైరన్ కూడా మోగలేదని స్థానికులు తెలిపారు. కంపెనీలో ఉపాధి పొందుతున్న వారిలో స్థానికేతరులే ఎక్కువగా ఉన్నారన్నారు. వైసీపీ నేతలు, చెప్తున్న మాటలు నమ్మసక్యంగా లేవని అన్నారు. ఇప్పటి వరకు, ఎందుకు కంపెనీ యాజమాన్యం వ్యక్తులను అరెస్ట్ చెయ్యలేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ, గాలి, నీరు అంతా, కలుషితం అయిపోయాయని, రాను రాను, మా పై దీర్ఘకాలికంగా, ఆరోగ్య ఇబ్బందులు వస్తాయని అంటున్నారని, ట్రీట్మెంట్ చేసేసి పంపించి వేస్తున్నారని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని చెట్లు కూడా మాడిపోయయని, ఆ గాలి పీల్చిన మాకు, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బండులు వస్తాయని అంటున్నారు. ఇవన్నీ అడుగుతుంటే, కోటి ఇచ్చాం, పది కోట్లు ఇస్తాం అని డబ్బులతో లెక్క చెప్తున్నారని, మాకు ఇవేమీ వద్దు అని, కంపెనీని ఇక్కడ నుంచి తరలిస్తాం అని చెప్పాలని, ఇక్కడ నుంచి తరలించాలని వాపోయారు. ఇవన్నీ అడగటానికి వస్తే, మమ్మల్ని అడ్డుకుని, కొంత మందిని అరెస్ట్ చేసారని, కంపెనీ వారితో మాత్రం ముచ్చట్లు, మాకు అరెస్ట్ లా అని వాపోతున్నారు.