వైజాగ్.. ప్రశాంతతకు మారు పేరు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు అక్కడ జీవిస్తూ ఉంటారు. నవ్యాంధ్రకు ఆర్ధిక రాజధాని. మొన్నటి దాక అక్కడ నుంచి పెట్టుబడి సదస్సులు, బ్లాక్ చైన్ ఇన్వెస్ట్మెంట్స్, ఐటి పెట్టుబడులు లాంటి వార్తలు వినిపించేవి. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్న పులివెందుల ముఠా అంటూ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అవును ఇది నిజం. వైజాగ్ లో ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందని, ఎవరూ అనుకోలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైజాగ్ లో ఒక ఖరీదైన భూమి పై, ఈ ముఠా కన్ను పడింది. దాన్ని తీసుకోవటానికి సిటిల్మెంట్ దందా మొదలు పెట్టారు. సింబియోసిస్ టెక్నాలజీస్ సీఈఓ ఓరుగంటి నరేశ్‌కుమార్ కు సంబంధించి, ఒక భూ వివాదం ఉందని తెలుసుకుని, ఈ ముఠా రంగంలోకి దిగింది. నరేష్ కుమార్ చాలా ఏళ్ళ క్రితం, మర్రిపాలెంలో ఆరెకరాల యూఎల్‌సీ మిగులు భూమి కొన్నారు.
దీని విలువ 100 కోట్లు దాకా ఉంటుంది. ఆ భూమిని ఆనుకుని, ఒక 200 గజాల్లో భూవివాదం నెలకొంది. ఆ భూమిని నరేష్ కుమార్ కొంత పరిహారం ఇచ్చి తీసుకున్నారు. అయితే ఇది వివాదం కావటంతో కోర్ట్ వరకు వెళ్ళటంతో, అక్కడ నరేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే 2013లో హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ మోహన్ అనేవ్యక్తి అవతల పార్టీతో జీపీఏ రాయించుకొని మరో రిట్ పిటిషన్ వేశారు. అప్పటి నుంచి నానుతూ ఉన్న ఈ విషయం పై, గత ఆదివారం పులివెందుల నుంచి వచ్చిన కొంత మంది నరేష్ కుమార్ ఇంటికి వెళ్లారు. అయుదుగురు సభ్యులు వచ్చారు. ఈ భూమి తమకు అమ్మడానికి 16మంది ముందుకు వచ్చారంటూ డాక్యుమెంట్లు, జీవోలతో ఓ బౌండ్ బుక్ ఆయనకు చూపించారు. ఆ వివాదం గురించి మాట్లాడాల్సిన పనిలేదని ఇది అంతా సవ్యంగా ఉందని, కావలంటే కోర్ట్ కు వెళ్ళండి అంటూ నరేష్ కుమార్ చెప్పటంతో, అవతలి వ్యక్తులు బెదిరించారు.
ఇలా అయితే ఈ భూమి నీకు దక్కదు, ప్రభుత్వానికి వెళ్ళిపోయేలా చేస్తాం అని వారు బెదిరించారని నరేశ్‌కుమార్ చెప్పారు. పులివెందుల నుంచి వచ్చామని, ఒకరు ఎంపీపీ అని, మరొకరు సర్పంచ్(మాజీ) అని, సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులమని పరిచయం చేసుకున్నారని తెలిపారు. మీరు సియం పేరు పెట్టి నన్ను బెదిరిస్తే, ఇదే విషయం, నేను ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షా కు చెప్తానని నరేష్ కుమార్ చెప్పటంతో, వీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అమిత్ షా పేరు చెప్పగానే, వెళ్లిపోయారని నరేష్ కుమార్ చెప్పారు. అయితే దీని పై పులివెందుల నుంచి వచ్చిన, లింగాల రామలింగారెడ్డి కొన్ని పత్రికలతో మాట్లాడుతూ, మేము అక్కడకు వెళ్లామని, అయితే బాలకృష్ణ మోహన్ , తమ భూమికి సంబంధించి ఎదో ఇష్యూ ఉంది, మాట్లాడి రండి అంటే వెళ్ళాం, ఆయన మాకు స్నేహితుడు కాబట్టి వెళ్ళాం, అంతే కాని మేము ఎవరినీ బెదిరించి, పంచాయతీ చెయ్యలేదు అని లింగాల రామలింగారెడ్డి చెప్పారు.