విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నాటకాలు ఆడుతూ, గల్లీలో హడావిడి చేస్తున్న బ్యాచ్ ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవరణలో జరుగుతున్న అఖిలపక్ష నేతల నిరసనల్లో, వైసీపీ నేతలు కూడా పాల్గుతున్నారు. ప్రశాంతంగా ప్రారంభం అయిన అఖిలిపక్ష సమావేశం, ఒక గందరగోళ పరిస్థితిలోకి మారింది. ఈ పరిస్థితికి కారణం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు. యదావిధిగా, మీ కోసం ప్రాణం ఇస్తాం, మీ తరుపున పోరాడతాం, కేంద్రం మెడలు వంచుతాం అంటూ, మాట్లాడి, చివరిగా మాత్రం, అసలు విషయం చెప్పటంతో, కార్మికులు ఎదురు తిరిగారు. ప్రధాని మోడి అప్పాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాను, అయితే ఆయనతో కలవటం గురించి గ్యారంటీ ఇవ్వలేను, కేంద్ర మంత్రిని అయితే కలుద్దాం, ఇక్కడ ఉన్న వారిని తీసుకుని వెళ్లి, కేంద్రంతో చర్చలు జరుపుదాం అంటూ విజయసాయి రెడ్డి చెప్పటంతో, ఒక్కసారిగా ఆందోళన రేగింది. అంతే కాకుండా, మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం, ప్రతి సారి సక్సస్ అవ్వదు కదా, కొన్ని సార్లు మన లక్ష్యం నెరవేరోచ్చు, కొన్ని సార్లు కుదరదు, మనకు కూడా కొంచెం పట్టు విడుపులు అనేవి ఉండాలి అంటూ విజయసాయి రెడ్డి చెప్పటంతో, కార్మికులు షాక్ అయ్యారు.
మీకు నచ్చినా, నచ్చక పోయినా నేను చెప్పేది వాస్తవం, మీరు నాతో పాటు ఢిల్లీ వస్తే రండి, లేకపోతే లేదు అంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. అయితే కార్మికులు విజయసాయి రెడ్డి వ్యాఖ్యల పై గట్టిగా నిలదీశారు. ప్రధాని మోడీ ఎందుకు కలవరు ? ముందే మీరు ఎలా చెప్తారు అంటూ నిలదీశారు. వేదిక పైనే విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరుతో, ఆయన ప్రసంగించిన తీరుతో అవాక్కయ్యారు. అయితే అవుతుంది లేకపోతే లేదు, పట్టు విడుపులు ఉండాలి అంటూ మాట్లాడటం ఏమిటి అని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డి వైఖరి చూస్తుంటే అనుమానం కలుగుతుందని అన్నారు. కొంత మంది విజయసాయి రెడ్డి ప్రసంగానికి అడ్డుపడగా, మంత్రి అవంతి ఎంత వారించినా వాళ్ళు ఆందోళన విరమించకపోవటంతో, విజయసాయి రెడ్డి అక్కడ నుంచి జారుకున్నారు. అయితే కార్ ఎక్కే సమయంలో కూడా, విజయసాయి రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేయగా, పోలీసులు సాయంతో వెళ్ళిపోయారు.