రేపు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ‘మోదీ గో బ్యాక్’ అంటూ నినాదాలతో నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రధాని పర్యటించనున్న విశాఖపట్నంల నిరసనలు ఉగ్రరూపం దాల్చాయి. . ప్రత్యేక హోదా సమితి ఆధ్వర్యంలో నగరంలో హోర్డింగ్లు వెలిశాయి. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నల్లరంగులో హోర్డింగ్లు పెట్టారు. మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ హోర్డింగుల్లో చెప్పారు. మోదీ పర్యటించే మార్గాల్లో హోర్డింగ్ వెలిశాయి.
ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఏపీలో మోదీ ఎప్పుడు అడుగుపెట్టినా అది చీకటి రోజన్నారు.తమ హక్కులు కాలరాసి ఈ గడ్డ మీద అడుగు పెడితే ఉపేక్షించమని హెచ్చరించారు. చట్టాలు చేసిన వారే అమలు చేయకుండా మోసం చేశారని, దేశ భద్రత విషయంలో ఎప్పుడూ కేంద్రాన్ని సమర్ధిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రం నమ్మక ద్రోహం చేసిందని, నమ్మించి నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. ‘‘మోదీ ఆ హామీని తుంగలో తొక్కారు. బీజేపీతో పాటు వారికి సహకరించిన పార్టీలను చిత్తుగా ఓడించాలి. ఏపీలో వైసీపీ ఫ్యాన్ ఉంటే.. హైదరాబాద్లో స్విచ్, ఢిల్లీలో ఫ్యూజ్ ఉంది. మోదీ మోసాన్ని ప్రశ్నిస్తే సీబీఐ, ఐటీ దాడులు చేస్తున్నారు. మోదీ పర్యటన కారణంగా రైల్వేజోన్ పేరుతో మాయజోన్ ప్రకటించారు. వాల్తేరు డివిజన్ని పక్క రాష్ట్రానికి ఇచ్చి ఏపీకి అన్యాయం చేశారు. ఇప్పుడు వచ్చే ఆదాయం మొత్తం ఒడిశాకే వెళ్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు రానీయకుండా కుట్రలు చేస్తున్నారు. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు కూడా లేకుండా చేశారు . మోసపూరితమైన రైల్వే జోన్ మాకు వద్దు.. విశాఖ జోన్ కావాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
గతంలో మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో ఆందోళనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. 'మోదీ గో బ్యాక్' అంటూ విజయవాడ, గుంటూరు సహా పలుచోట్ల ఫెక్సీలు వెలిశాయి. ఖాళీకుండలు, మట్టీనీళ్లతో లెఫ్ట్పార్టీల కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరుకు మోదీ వెళ్లే మార్గంలో ఆయనకు వ్యతిరేకంగా వందలకొద్దీ ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిపై ప్రధాని కార్టూన్లు ముద్రించారు. ఆంధ్ర ప్రజలను మోసం చేసి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు విజయవాడలో ఫ్లెక్సీలను పెట్టారు. లెనిన్ సెంటర్లో సీపీఎం, సీపీఐ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అమరావతి భూమిపూజకు వచ్చినప్పుడు మోదీ ఇచ్చిన మట్టి, నీళ్లను గుర్తుచేస్తూ.. వాటిని కుండల్లో తీసుకొచ్చి లెనిన్ సెంటర్లో పగలగొట్టారు.