దశాబ్ద కాలం నాటి ఎదురుచూపులకు తెరపడింది. జీతాల కోసం పడిగాపులకు కాలం చెల్లింది. పన్ను వసూళ్ల కోసం కాచుక్కూర్చునే రోజులకు తెర పడింది. ఏటా రూ.130 కోట్ల జీతాల చెల్లింపులతో పాటు ఆదాయ మార్గాలను అభివృద్ధికి మరల్చలేక నిస్సత్తువుగా చూస్తోన్న వీఎంసీకి మంత్రి మండలి నిర్ణయం రూపంలో శుభవార్త వచ్చింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో వీఎంసీతో పాటు గ్రేటర్ విశాఖపట్టణానికి కూడా 010 పద్దు ద్వారా జీతాల చెల్లింపు ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ నిర్ణయించారు. వారంలో అధికారిక ఉత్తర్వులను ట్రెజరీకి ఇచ్చి ఏప్రిల్ నుంచి జీతాల చెల్లింపునకు రంగం సిద్ధమవుతోంది. దీంతో వీఎంసీలోని 3,732 మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు.
అధికారంలోకి వచ్చింది మొదలు మేయర్ కోనేరు శ్రీధర్ 010 కోసం విశ్వ ప్రయత్నం చేశారు. గత రెండు కౌన్సిల్ సమావేశాల్లో ఆయన 010 పద్దుపై ధీమా వ్యక్తం చేశారు. దీనిపై విశ్వసించని వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో 010 అంశాన్ని పొందుపరచలేదని, అమలు అసాధ్యమని మాట్లాడారు. వారికి సమాధానమిస్తూ మంత్రి మండలి వీఎంసీకి 010 పద్దును అమలుచేయడాన్ని తీర్మానిస్తూ నిర్ణయించింది. ప్రతి నెలా వచ్చే జీతాలే తప్ప డీఏ అరియర్స్, పీఆర్సీ (పాతవి, కొత్తవి), సరెండర్ లీవ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి భత్యాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో వీఎంసీకి పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.180 కోట్లు, నెట్ భత్యాలు రూ.48కోట్ల 79లక్షలకు పైగా ఉండగా, రికవరీలు రూ.7కోట్ల 92వేలకు పైగా ఉన్నాయి.
గ్రాస్‌ను చూస్తే రూ.56కోట్లకు పైమాటే అందుకోవాల్సి ఉంది. వాటితో పాటు ఏటా చెల్లించే రూ.130కోట్ల జీతాలు అదనం. ఈ పద్దు ఆమోదంతో ఆయా ఆదాయాలన్నీ నగరాభివృద్ధికి మరల్చే అవకాశముంది. మేయర్ మాట్లాడుతూ "ఆనందంలో మాటలు రావడంలేదు. నా హయాంలో సాధించాను అని గర్వంగా చెప్పుకునే అంశాల్లో 010 పద్దు ఓ ఆణిముత్యం. అసాధ్యమన్న పదాన్ని సుసాధ్యం చేసి వీఎంసీకి 010 పద్దును అమలుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ధన్యవాదాలు. ఇది కచ్చితంగా టీడీపీ విజయం. బడ్జెట్లో పొందుపరచలేదని, అమలు అసాధ్యమని అన్న వారి మాటలకు మంత్రి మండలి నిర్ణయమే సమాధానం."