మాతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు, అన్ని పనులు చేపించుకుని, మాకు ఇస్తున్న జీతం మాత్రం 5 వేలు, అవి దేనికీ సరిపోవటం లేదు, ఇప్పటికి రెండేళ్ళు అవుతుంది, మా పరిస్థితి ఏంటి అంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇవ్వటానికి రెడీ అయ్యారు వాలంటీర్లు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, వాలంటీర్ అనే వ్యవస్థ తీసుకుని వచ్చారు. సంక్షేమ పధకాలకు వారధిలా వీళ్ళు పని చేస్తారు అని చెప్తున్నా, వీరి పై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఒకే పార్టీకి కొమ్ముకాస్తూ, వీళ్ళు చేస్తున్న అరాచకాలు, ప్రతి రోజు వార్తల్లో వస్తూనే ఉన్నాయి. సాక్షాత్తు విజయసాయి రెడ్డి , 90 శాతం మంది వాలంటీర్లు మా పార్టీ వాళ్ళే అని బహిరంగంగా గొప్పగా చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది చర్చ కాదు, ఇది పక్కన పెడితే, ఈ 90 శాతం మంది వైసీపీ కార్యకర్తలు ఉన్న వాలంటీర్లు, ఇప్పుడు తమ ప్రభుత్వం పైనే నిరసనకు సిద్ధం అవుతున్నారు. తమకు ఇస్తున్న జీతాలు సరిపోవటం లేదని, తమకు ఇచ్చే పనులు ఎక్కువ, చేసే చాకిరీ ఎక్కువ, మీరు ఇచ్చే డబ్బులు తక్కువ అంటూ, ఆందోళన బాట పట్టారు వాలంటీర్లు. ఇప్పటికే గుంటూరులో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో వాలంటీర్లు సమావేశం అయ్యారు. తమ కష్ట నష్టాలు చర్చించుకున్నారు. ప్రభుత్వం తమను చిన్న చూపు చూస్తుందనే భావనకు వచ్చారు.
తమకు జీతాలు పెంచటమే కాక, ఉద్యోగాలకు కూడా క్రమబద్దీకరించాలని డిమాండ్ చేసారు. రేపు దీని పై విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, ఈ నిరసనకు అన్ని జిల్లాల నుంచి వాలంటీర్లు తరలి రావాలని పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం కనుక తమ డిమాండ్లకు స్పందించక పోతే, ఉద్యమ బాట పడతామని, తేల్చి చెప్పారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజుకి ఒక తల నొప్పి వస్తుంది. ఇప్పటికే బియ్యం వ్యాన్ లు తోలే డ్రైవర్లు , రెండు రోజులుకే తాము ఈ పని చేయలేం అని, మూటలు మోసే పని కూడా మేమే చేయాల్సి వస్తుందని, ఆయిల్ ఎక్కువ తాగేస్తుందని, ఇలా పెద్ద చిట్టా చెప్పి,మొత్తానికి బియ్యం పంపిణీ ఆపేసారు. దీంతో దిగి వచ్చిన ప్రభుత్వం, అన్ని ఖర్చులకు కలిపి,మరో 5 వేలు పెంచింది. అయితే మూడు రోజులు క్రితం వచ్చిన వాళ్ళే నిరసన చేయగానే 5 వేలు పెంచారని, తాము రెండేళ్ళ నుంచి చేస్తున్నా, తమ జీతాలు పెంచలేదని, అందుకే తాము కూడా నిరసన తెలిపి, తమ జీతాలు పెంచే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తాం అని వాలంటీర్లు వాపోతున్నారు.