ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులపై నమ్మకం లేకే వలంటీర్ల వ్యవస్థని నమ్ముకున్నారా అంటూ ఏపీ సర్కారుపై హైకోర్టు మండిపడింది. వలంటీర్ల వ్యవస్థపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగగా కోర్టు మరోసారి వైసీపీ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లబ్దిదారుల ఎంపిక బాధ్యతను వలంటీర్లకు ఎలా అప్పగిస్తారంటూ ప్రశ్నించింది. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వంలోనైనా లబ్దిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా? ఇప్పుడు ఎందుకు వలంటీర్లను వినియోగిస్తున్నారని కోర్టు సూటిగా నిలదీసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వలంటీర్ల వ్యవస్థను సమాంతరంగా వాడుతున్నారనే అర్థంలో హైకోర్టు వ్యాఖ్యలతో సర్కారు ఉలిక్కిపడింది. రాజకీయ కారణాలతో తమను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని హైకోర్టును ఆశ్రయించిన గారపాడు గ్రామానికి చెందిన 26 మంది లబ్దిదారులు ఆశ్రయించగా దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ అంశంపై కోర్టుకు హాజరైన సెర్ప్ సిఈఓ ఏఎండీ ఇంతియాజ్ ని వలంటీర్లకు జవాబుదారీతనం ఏముంటుందని హైకోర్టు ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు కోర్టు వ్యతిరేకం కాదని, వాటి అమలుకు ఎంచుకున్న విధానమే చట్టవిరుద్దమైనది అని కోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్ల పేరుతో విద్యావంతులను దోపిడీ చేస్తున్నారని, చట్టం అనుమతిస్తే వలంటీర్ల సర్వీసును రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఉద్యోగులుగా నియమించి సర్వీస్ రూల్స్ రూపొందించాలని జడ్జి పేర్కొన్నారు. న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఇంతియాజ్ ను ఆదేశించిన న్యాయమూర్తి కేసు విచారణ మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.
వాలంటీర్ల పై సంచలన వ్యాఖ్యలు చేసిన హైకోర్టు
Advertisements