ఏపీలో ఎన్నికల కమిషన్, చంద్రబాబునాయుడు, మధ్య రసవత్తరంగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారంటూ వైసీపీ ఫిర్యాదు చెయ్యటం, ఫిర్యాదు చేసిన వెంటనే, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవటం, చివరకు రాష్ట్ర అధికారులకు తలంటటం కూడా చూస్తూ వస్తున్నాం. చంద్రబాబుని పని చెయ్యనివ్వకుండా, ఏపి ప్రజలను ఇబ్బంది పెట్టటమే లక్ష్యంగా వైసీపీ పని చేస్తుంది. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి.. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని ఉల్లంఘిస్తున్నారంటూ లేఖ ద్వారా ఆయన ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలతో ప్రభుత్వ సదుపాయం అయిన ప్రజావేదికలో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహిస్తున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేఖలో ఏముంది..!? "ప్రజా వేదిక ప్రభుత్వ సముదాయం దానిని పార్టీ అవసరాల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అయిన వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను పార్టీ అవసరాలకి వాడుతున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఒక పార్టీ మాత్రమే ఈ సదుపాయాలను ఉపయోగించుకోవడం సమంజసం కాదు."
"ప్రభుత్వ అతిథి భవనాలు, మీటింగ్ హాల్‌లు, వీడియో, టెలీ కాన్ఫరెన్స్ సదుపాయాలను మిగిలిన పార్టీలకు కూడా ఉపయోగించుకోవడానికి సమాన అవకాశం కల్పించాలి. ఆయా సదుపాయాలను ఉపయోగించుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్నారా? లేదా..? మాకు తెలియజేయండి. ఇప్పటికైనా ఎన్నికల సంఘం ఈ సంఘటనలపై సమీక్షించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు పరిచేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి" అని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖపై ఎన్నికల అధికారి ద్వివేది ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి. ఇప్పుడు చంద్రబాబునాయుడు ఏం చేస్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే ఈసీతో ఢీ అంటే ఢీ అంటున్నారు చంద్రబాబు. ఇప్పుడు కూడా దూసుకెళ్తారా?