గ్రామ వలంటీర్ల పోస్టులకు పార్టీ కార్యకర్తలు దరఖాస్తు చేసుకునేలా చూడాల్సిన బాధ్యత బూత్‌ కమిటీల ఇన్‌ఛార్జులదేనని వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వారికెలా న్యాయం చేయాలనేది సీఎం ముఖ్య సలహాదారుతో పాటు పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. గ్రామ వలంటీర్లకు నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని, అర్హులు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో లోక్‌సభ, శాసనసభ, మండల బూత్‌ కమిటీ ఇన్‌ఛార్జులతో వైకాపా బూత్‌ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ తీరుపై సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, విజయసాయిరెడ్డి కార్యకర్తలకు వివరించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ‘పార్టీ విజయంలో కార్యకర్తల కృషి ఎంతో ఉంది.

vsreddy 14062019

మీ సేవలను పార్టీ ఎన్నటికీ మరవదు. పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఏర్పాటు చేసుకున్నాక ప్రతి శని, ఆదివారాలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. గ్రామ వలంటీర్లు పార్టీకి, ప్రజలకు మేలు చేస్తున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 2019లో పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. అవినీతిరహిత పాలనతో 2024లోనూ అధికారం నిలబెట్టుకోవటానికి అందరూ పట్టుదలగా పనిచేయాలి’ అని చెప్పారు. ప్రజాసాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.44కోట్ల కుటుంబాలు ఉన్నాయని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలిపారు. 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీరు వంతున 2.88లక్షల మంది కార్యకర్తలను తీసుకునే వీలుందన్నారు. ‘ఎంపిక విధానంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

vsreddy 14062019

మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దారు నేతృత్వంలోని కమిటీ ఎంపిక ప్రక్రియ చేపడుతుంది. పార్టీ కోసం కష్టపడిన వాళ్లు దరఖాస్తు చేసుకునేలా చూడాలి. గ్రామీణ ప్రాంతంలో గ్రామం, పట్టణ ప్రాంతంలో వార్డు యూనిట్‌గా గ్రామ వలంటీర్ల ఎంపిక ప్రక్రియ చేపడతారు. ’ అని ఆయన చెప్పారు. ‘పల్లెల్లో గ్రామ సచివాలయాల నిర్మాణం పూర్తయినవెంటనే వాటిలో భారీ సంఖ్యలో ఉద్యోగాలుంటాయి. వలంటీర్ల నియామకం గురించిన ఆలోచన చేశాం. వైసీపీ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ సముచితస్థానం ఉంటుంది’ అని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వాళ్లలో ఎక్కువగా పదోతరగతి కంటే తక్కువ చదివిన వారే ఉన్నారని, గ్రామ వలంటీర్ల ఎంపిక ఇప్పుడే చేపడితే కార్యకర్తల్లో అసంతృప్తి రావచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read