జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, గతంలో రఘురామకృష్ణం రాజు వేసిన పిటీషన్ పై, రెండు మూడు నెలలుగా వాదనలు జరిగి, చివరకు ఈ నెల 25వ తేదీకి కేసు తీర్పు ఇచ్చే విధంగా పిటీషన్ వాయిదా పడింది. ముఖ్యంగా సిబిఐ తీరు, ఇక్కడ అందరినీ ఆశ్చర్య పరిచింది. వాళ్ళు కౌంటర్ వేయకుండా, ఒకసారి వేస్తాం అని, ఒకసారి లేదని, మళ్ళీ వేస్తామని, చివరకు కోర్టు ఇష్టం అంటూ చెప్పిన విధానం పై చర్చ జరుగుతుంది. 25వ తేదిన ఏమి తీర్పు వస్తుందో కానీ, ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు, ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. ఈ రోజు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై, విచారణ జరిగింది. ఈ కేసులో పిటీషనర్ ప్రధానంగా నాలుగు అయిదు విషయాలు చెప్తూ, తన వాదన వినిపించారు. ముఖ్యంగా పిటీషన్ వేసిన తరువాత, తాము నోటీస్ పంపిస్తే, ఆ నోటీస్ ని విజయసాయి రెడ్డి తీసుకోలేదని, కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప తాము నోటీస్ తీసుకోమని చెప్పారు అంటూ, పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు స్పందిస్తూ, పిటీషనర్ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన నోటీస్ కి మీరు ఎందుకు స్పందించటం లేదు అంటూ, విజయసాయి రెడ్డి తరుపు న్యాయవాదులను, సిబిఐ కోర్టు ప్రశ్నించింది.
ఒక పక్క వాళ్ళు ఇచ్చిన నోటీస్ కు సిబిఐ స్పందించింది కదా, మరి మీరు ఎందుకు స్పందించటం లేదు అంటూ, ప్రశ్నించారు. కోర్టు విజయసాయి రెడ్డి న్యాయవాదుల పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే సమయంలో, సిబిఐ, విజయసాయి రెడ్డికి కూడా కౌంటర్ దాఖలు చేయాలి అంటూ, సిబిఐ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సిబిఐ, ఈ నెల 13కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో, వీళ్ళు వేసే కౌంటర్ ని బట్టి, దాన్ని ఆసరాగా తీసుకుని మరోసారి వాదనలు కొనసాగే అవకాసం ఉంది. ఇప్పటికే విజయసాయి రెడ్డి బెయిల్ కండీషన్లను ఉల్లంఘించారని, తరుచూ కేంద్ర మంత్రులను కలుస్తూ, ఢిల్లీలో ఆఫీస్ లు చుట్టూ తిరిగి, తనకు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనే విషయంతో, సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారు అంటూ, ప్రధానంగా పిటీషనర్ ఆరోపించారు. మరి దీని పై విజయసాయి రెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి. దీని పై విజయసాయి రెడ్డి, సిబిఐ ఇచ్చే కౌంటర్ ఆధారంగా, ఈ నెల 13న కోర్టు ఏమి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.