సుప్రశిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచల కొండపైనున్న కోదండరాముని విగ్రహం తలభాగం పెకిలించిన అంశం శనివారం నాటికి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గత కొద్ది రోజులుగా బీజేపీ, టీడీపీ, సాధుపరిషత్ చేస్తున్న నిరసన తీవ్ర రూపం దాల్చడంతో తోపులాటలు కూడా అనివార్యమయ్యాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు తదితరులు ఒకవైపు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు మరో వైపు రామతీర్థం విచ్చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. చంద్రబాబు వస్తున్నారని తెలుసుకుని విజయసాయి రెడ్డి రావటం మొత్తం వివాదానికి కారణం అయ్యింది. తొలుత విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో కొండను అధిరోహించే క్రమంలో, ఆపైన దిగివచ్చి వెనుదిరిగే నేపథ్యంలో బీజేపీ, టీడీపీలు డోస్ పెంచాయి. ఆయా సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా విజయసాయిరెడ్డి మెట్లు దిగిన వెంటనే బీజేపీ శ్రేణులు అడ్డుక పడే ప్రయత్నం చేయగా వారికి పోలీసులకు మధ్య పెద్ద స్థాయిలో తోపులాట జరిగింది. ఆ సమయంలోనే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని నేలకొరిగిపోయారు. తోపులాట పరిస్థితులను అధిగమించిన విజయసాయిరెడ్డి , ఆ ఆపార్టీ ఎమ్మెల్యేల బృందం నాలుగు అడుగులు ముందుకేశాక టీడీపీ కార్యకర్తలు పోలీసుల నడుమ పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఆ సమయంలో విజయసాయిరెడ్డి వాహనంపై కొంత మంది భక్తులు, చెప్పులు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు, రాయి పిక్కలతో తదితరాలతో దాడులు జరిగాయి.
విజయసాయిరెడ్డి అండ్ కో., నిష్క్రమణ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వచ్చారు. దీంతో, ఘటనా స్తలమైన నీలాచలం కొండ ఎక్కే క్రమంలో చంద్రబాబుకు అక్కడ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఆనేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామమోహనరావు, పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు తదితరులతో కలిసి చంద్రబాబు కొండపైనున్న కోదండ రామ ఆలయాన్ని సందర్శించి అప్పటికే అక్కడున్న వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుమారు నాలుగు గంటల సమయానికి కిందికి దిగిన చంద్రబాబు సభలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై నిప్పులు చెరగడమే కాకుండా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇది ఇలా ఉండగా, నిన్న తన పై చేసిన దుశ్చర్యకు కారణం చంద్రబాబు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు అని, వాళ్ళ పై చర్యలు తీసుకోవాలని, విజయసాయి రెడ్డి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి కంప్లైంట్ ప్రకారం, నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.