వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, నెంబర్ 2ని అంటూ, హడావిడి చేసే విజయసాయి రెడ్డికి మీడియా సాక్షిగా షాక్ తగిలింది. క-రో-నా సెకండ్ వేవ్ లో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పని తీరు అధ్వాన్నంగా ఉందని, అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ హాస్పిటల్ బయట బెడ్లు లేక ఆటల్లో, అంబులెన్స్ లలో ప్రజలు పిట్టల్లా ఎగిరి పోతున్న వార్తలు వింటున్నాం. మందులు దొరకటం లేదు, ఆక్సిజన్ దొరకటం లేదు, బెడ్లు దొరకటం లేదు, ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ ఇలా అనేక ఇబ్బందులతో ప్రజలు అల్లాడుతున్నారు. మరో పక్క, ప్రభుత్వం మాత్రం, అద్భుతం అమోఘం అని చెప్తుంది. ఇక విజయసాయి రెడ్డి అయితే, ప్రతి రోజు ట్విట్టర్ లో ఊదరగొడుతూ ఉంటారు. మా పరిపాలన చూసి, ప్రపంచ దేశాలు నేర్చుకుంటున్నాయి అంటూ హడావిడి చేస్తాడు. ప్రతి రోజు మేము తోపు, మేము తురం అంటూ, ట్వీట్లు వేస్తూ ఉంటారు. అసలు ఈ ప్రపంచమే, మమ్మల్ని చూసి నేర్చుకుంటుంటే, చంద్రబాబు ఎందుకు ఇలా ఏడుస్తాడు అంటూ, ట్వీట్ వేసారు. ఇక మొన్నా మధ్య జగన్ మోహన్ రెడ్డి గారు కూడా, 104 నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు, మేము వచ్చి మీ దగ్గర వాలిపోతాం అని చెప్పారు. ప్రజలు క-రో-నా కారణంగా ఏ కష్టం వచ్చినా, క్షణాల్లో వాలిపోతాం అని చెప్పారు. అయితే వాస్తవ పరిస్థితి మాత్రం వేరేగా ఉంది.
ప్రతిపక్షాలు అన్నీ ఆరోపించాయి. 104 పని చేయటం లేదని చెప్పాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి మాత్రం, ఈ విషయంలో షాక్ తగిలింది. మీడియాని మొత్తం వెంట బెట్టుకుని, షో చేద్దామని వెళ్ళిన విజయసాయి రెడ్డికి పాపం అనుకోని షాక్ తగిలింది. తమ ప్రభుత్వం ఎంత అద్భుతంగా పని చేస్తుందో, ఆయనే స్వయంగా చూసారు. 104 ఎలా పని చేస్తుందో చూడటానికి, విజయసాయి రెడ్డి కాల్ సెంటర్ కు వెళ్ళారు. ఆయన వచ్చిన సమయంలో ఒక్క కాల్ కూడా రాకపోవటంతో, ఆయనే స్వయంగా ఫోన్ చేసి మీడియా ముందు చూపిద్దాం అనుకున్నారు. అయితే, 20 నిమిషాలు పాటు ప్రయత్నం చేసినా, 104 వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మీడియా ముందు విజయసాయి రెడ్డి పరువు పోయింది. ప్రభుత్వం పరువు కూడా పోయింది. చెప్పేదానికి చేసే దానికి లింక్ లేదని అర్ధం అయ్యింది. దీంతో అధికారులు మీద నాలుగు అరుపులు అరిసారు. వారు, సాంకేతక లోపం అని చెప్పారు. ఇలాంటి లోపాలు సరి చేసుకుని, సమర్ధవంతంగా పని చేయాలని విజయసాయి రెడ్డి చెప్పి, అక్కడ నుంచి వచ్చేసారు.